
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న వన్నియర్ కమ్యూనిటీకి కోటాను రద్దు చేసింది. ప్రభుత్వ విద్యారంగంలో, ఉద్యోగాల్లో ఈ కమ్యూనిటీకి రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వన్నియర్ కమ్యూనిటీకి 10.5 శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నది. విద్యారంగం, ప్రభుత్వ ఉద్యోగాల్లో వన్నియర్ కులానికి 10.5 శాతం రిజర్వేషన్‌ను గత నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రిజర్వేషన్‌ను అమలు పరచడానికి అవకాశం ఇస్తున్న వన్నియర్ రిజర్వేషన్ యాక్ట్ 20212ను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది.
ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఈ కోటాను మద్రాస్ హైకోర్టు నవంబర్ 1న తొసిపుచ్చింది. తాజాగా, మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం ఆర్టికల్ 14, 15, 16లను ఉల్లంఘిస్తున్నదని వివరించింది. సమానత్వ హక్కు, మతం, జాతి, కులం, లింగం, ప్రాంతం ఆధారిత వివక్షపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న రాజ్యాంగ విలువలను ఈ చట్టం ఉల్లంఘిస్తున్నదని పేర్కొంది.
గతేడాది ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందు అంటే ఫిబ్రవరిలో అప్పటి ఏఐఏడీఎంకే ప్రభుత్వం వన్నియర్ రిజర్వేషన్ యాక్ట్‌ను పాస్ చేసింది. అయితే, ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కుప్పకూలింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌ను యథావిధిగా అమలు చేసింది.
మద్రాస్ హైకోర్టు నిర్ణయం లోపూరితమైనదని, ఒక వెనుకబడిన సముదాయాన్ని ప్రధాన స్రవంతిలో కలపడానికి తెచ్చే అధికారం శాసన సభకు ఉన్నదని పిటిషనర్లు వాదించారు. వన్నియర్ కమ్యూనిటీకి రిజర్వేషన్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా అసెంబ్లీ అంగీకరించిందని, ఇది రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి వెలువడిన అభిప్రాయంగా పరిగణించాలని పట్టాలి మక్కల్ కాచ్చి పార్టీ వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ వాదించారు.
ఈ వాదనలపై సుప్రీంకోర్టు స్పందించింది. వెనుకబడిన తరుగతుల్లోకెల్లా వన్నియర్ కమ్యూనిటీ మరింత వెనుకబడిందని, దాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలనడానికి సరిపడా డేటా ప్రభుత్వం దగ్గర లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వన్నియర్లున ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. తమిళనాడులో వెనుకబడిన కులాల్లో వన్నియార్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీరికి భారీగా రాజకీయ ప్రాబల్యం ఉన్నది. వెనుకబడిన తరగతుల్లో వారి జనాభా ఎక్కువ ఉన్నందున ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని దీర్ఘకాలం పోరాడారు. దీంతో ఎంబీసీలకు మొత్తం ఇచ్చే 20 శాతం కోటాలో.. 10.5 శాతం కోటా కేవలం వన్నియర్ కమ్యూనిటీకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, అదే వెనుకబడిన తరగతుల్లోని మిగిలిన సుమారు ఇతర 100 కమ్యూనిటీలు 20శాతంలో 10.5 శాతం పోగా మిగిలిన శాతం కోటాను పొందాల్సి ఉంటుంది.
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో 30 శాతం వెనుకబడిన కులాలు, 20 శాతం అత్యధిక వెనకబడిన కులాలకు కోటా ఉన్నది. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు ఒక్క శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.