
అంతసేపు కూల్ గా ఉన్న ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా.. ఒక్క సారిగా కోపోద్రిక్తుడు అయ్యారు. సహనం కోల్పొయారు. ఆయనని ప్రశ్నలు అడిగిన జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అడగడం సరైంది కాదని అన్నారు. మీడియాకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ రాందేవ్ బాబా ఎందుకు అసహనం వ్యక్తం చేశారు. ? ఆయన కోపానికి కారణాలేంటి ? ఆ వీడియోలో ఏముంది అంటే ఇది చదవాల్సిందే.
హర్యానాలోని కర్నాల్ లో ఉన్న తన స్నేహితుడు అభేదానంద్‌ని కలవడానికి బాబా రామ్‌దేవ్ బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ మాటల సందర్భంగా ఓ జర్నలిస్టు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రశ్నించారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. ‘ గతంలో మీరు లీటర్‌కు రూ. 40 పెట్రోల్, రూ. 300 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓ టీవీ ఛానెల్ సూచించారు. మరి ఇప్పుడు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీనిపై మీరు ఏమంటారు’ అని ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్నలెందుకు మంచి ప్రశ్నలు అడగండి అని రామ్ దేవ్ బాబా సమాధానం ఇచ్చారు. మీరే కదా బాబా ఆ సమయంలో ఆ విధంగా చెప్పారు అని ఆ జర్నలిస్టు మళ్లీ ప్రశ్నించారు. దీంతో ఆయనపైకి రామ్ దేవ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్‌దేవ్ జర్నలిస్టును నోరుమూసుకోమని ఆదేశిస్తూ ఇలా అంటాడు ‘ అవును. నేనే అన్నాను. ఇప్పుడు ఏం చేయాలంటావ్. నా తోక తెగిపోతుందా? మీ (మీడియా) ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను ఏదైనా ఒప్పందం తీసుకున్నానా? ఏం చేస్తారు? నోరుముయ్యి. ఇంకా ఏమైనా అడిగితే సరికాదు. ’’ అంటూ ఆయన కోపోద్రిక్తుడు అయ్యారు.
ఈ ప్రశ్నకు ముందు, అదే జర్నలిస్ట్ ఆయనను ఈ రోజుల్లో ప్రజలు యోగా గురువు అని కాకుండా లాల్‌దేవ్ అని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగాడు. దీనిపై రామ్‌దేవ్ స్పందిస్తూ.. మీకు కడుపులో నొప్పి ఎందుకు అని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో అందరూ మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ధరలు తగ్గితే ట్యాక్స్ రాదని, అప్పుడు దేశం ఎలా నడుస్తుందని, సాలరీలు ఎలా ఇస్తారని, రహదారులు ఎలా నిర్మిస్తారని గవర్నమెంట్ చెబుతోందని అన్నారు. ‘‘ అవును, నిజమే ద్రవ్యోల్బణం తగ్గాలి, అది సరైనదే, దానికి నేను సమ్మతిస్తాను. కానీ ప్రజలు శ్రమించాలి. నేను ఒక సన్యాసిని అయి ఉండి తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేస్తున్నాను. ఆ సమయం నుంచి రాత్రి పది గంటల వరకు పని చేస్తున్నాను. ప్రతీ ఒక్కరూ పని చేయాలి ’’ అని తెలిపారు.
2014 సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాందేవ్ బాబా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందన ధరలు పెరుగుతున్నాయని, తక్కువ ధరలకే ఇందనాన్ని ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఇప్పుడు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ జర్నలిస్టు రాందేవ్ బాబాను ప్రశ్నించారు. దీంతో ఆయన కోపంగా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.