పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిసి ఇప్పుడు రేప్ అంటే ఎలా?: రేప్ కేసులో నిందితుడిని నిర్దోషిగా తేల్చిన సుప్రీం

By Mahesh KFirst Published Feb 4, 2023, 4:42 PM IST
Highlights

పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిసి తర్వాత వేరే కారణాలతో విడిపోయి అప్పటి సంబంధాన్ని ఇప్పుడు అత్యాచారం అనడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. రేప్ కేసులో నిందితుడిని నిర్దోషిగా తీర్పు ఇచ్చింది.
 

న్యూఢిల్లీ: ఒకప్పుడు పరస్పర అంగీకారంతో శారీరకంగా కలిసి వేరేవో కారణాలతో సంబంధాలు చేదెక్కితే ఇప్పుడు ఆ సంబంధాన్ని రేప్‌ కేసుతో ముడిపెడితే ఎలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేప్ కేసులో నిందితుడిని నిర్దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టుల తీర్పును పక్కన పెట్టి తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 

ఢిల్లీకి చెందిన నయీం అహ్మద్‌తో ఓ వివాహిత సంబంధం పెట్టుకుంది. తన భర్తను, ముగ్గురు పిల్లలను వదిలి పెట్టి 2009లో అతనితోపారిపోయింది. 2011లో ఒక మగ పిల్లాడికి వారిద్దరూ జన్మనిచ్చారు. కొన్నాళ్ల తర్వాత అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి విముఖత చూపాడు. దీనితో ఆమె 2012లో నయీం నేటివ్ ప్లేస్‌కు వెళ్లింది. నయీంకూ పెళ్లి అయినట్టు తెలిసింది. అయినా, ఆమె తన భర్త నుంచి 2014లో విడాకులు తీసుకుంది. ఎన్ని సార్లు ప్రయత్నించినా నయీం పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆమె 2015లో అతనిపై రేప్ కేసు పెట్టింది. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు నయీంను దోషిగా తేల్చింది. ఢిల్లీ హైకోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే వారిద్దరికి పుట్టిన బిడ్డను పెంచడానికి రూ. 5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. తాజాగా, సుప్రీంకోర్టు అతనిని రేప్ కేసు నుంచి నిర్దోషిగా తేల్చింది. కానీ, రూ. 5 లక్షలు చెల్లించే ఆదేశాన్ని సమర్థించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది.

ఆమె తరఫున ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ఈ కేసును అజయ్ రస్తోగీ, బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారించింది. తన అనుమతిని దుర్వినియోగపరచుకోవడం, లేదా అబద్దాపు హామీ ఇచ్చి మోసం చేయడం వంటి మాటలను ఈ ధర్మాసనం విశ్లేషించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత వేరే కారణాలతో దూరమైనప్పుడు మహిళలు లేవనెత్తే సందర్భాల్లోనూ ఇలాంటి మాటలు వాడుతున్నారని పేర్కొంది.

Also Read: మైనర్ కుమార్తెపై పలుమార్లు అత్యాచారం.. గర్బవతిని చేసిన తండ్రికి మూడు జీవితఖైదీల శిక్ష..

ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టుల తీర్పులు సరైనవేనని, తన క్లయింట్‌ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడని, ఆ మాటను కేవలం దురుద్దేశ ఆలోచనలతోనే ఇచ్చాడని ఇందిరా జైసింగ్ వాదించారు. కాగా, నయీం కౌన్సిల్ మాత్రం ఈ వాదనలను ఖండించారు. ఆ మహిళ అడిగిన పెద్ద మొత్తాలను నయీం అహ్మద్ ఇవ్వలేని పరిస్థితుల్లోనే ఆమె అత్యాచారం ఆరోపణలతో ఫిర్యాదు చేసిందని అన్నారు.

ఈ కేసులో తీర్పును న్యాయమూర్తి త్రివేది రాస్తూ.. ఫిర్యాదుదారైన మహిళ ముగ్గురు పిల్లలకు తల్లి, ఆమె అనుమతిస్తున్న నైతిక లేదా అనైతిక పని(శారీరకంగా కలవడానికి అంగీకారం తెలుపడం) ద్వారా ఎదురయ్యే పరిణామాల తీవ్రతను ఆలోచించే, అంచనా వేసే జ్ఞానం ఆమెకు ఉంటుంది అని పేర్కొన్నారు. నయీం అహ్మద్‌తో సంబంధం పెట్టుకుని తన భర్తను, అతని ద్వారా కలిగిన ముగ్గురు పిల్లలను మోసం చేయడమే కాదు, నయీం అహ్మద్‌తో పెళ్లి చేసుకుంటాడనే అబద్ధపు హామీతోనైనా శారీరకంగా కలిసి అక్రమంగా ఒక పిల్లాడిని కని, అతనికీ ఆల్రెడీ పెళ్లి అయిందని, సంతానం కూడా ఉన్నదని తెలిసినా ఎలాంటి సమస్య లేకపోవడం గమనార్హం అని వివరించారు. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుంటే ఆ మహిళకు అతడు అబద్ధాలు చెప్పి నమ్మించడం వల్ల శారీరక సంబంధానికి అంగీకరించిందనే విషయాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. కాబట్టి, అతడిని దోషిగా తేల్చలేమని తెలిపారు.

click me!