సూడాన్ సంక్షోభం: ప్రధాని మోడీ అధ్య‌క్ష‌త‌న ఉన్నత స్థాయి సమావేశం.. భారతీయుల రక్షణ కోసం చర్యలు

By Mahesh RajamoniFirst Published Apr 21, 2023, 3:39 PM IST
Highlights

New Delhi: సూడాన్ సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జ‌రుగుతోంది. సూడాన్ లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా పాల్గొన్నారు.
 

Sudan Crisis-High level meeting chaired by PM Modi : ఆఫ్రికా దేశమైన సూడాన్ లో గత వారం రోజులుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఆర్మీ, పారామిలటరీ బ‌ల‌గాలు (పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్-RSF) పరస్పరం ఘర్షణ పడుతున్నాయి. దీంతో ఆ దేశంలో ప‌రిస్థితులు దారుణంగా మారుతున్నాయి.  ఈ పోరాటం కారణంగా చాలా మంది భారతీయులు సూడాన్ లో చిక్కుకుపోయారు. ఇప్ప‌టికే  ఒక భారతీయుడు కూడా మృతి చెందాడు.

ఈ నేప‌థ్యంలోనే సూడాన్ లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల స్థితిగతులు, వారికి ఏ విధంగా సహాయం చేయవచ్చనే విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, వైమానిక దళాధిపతి, నేవీ చీఫ్, విదేశాంగ కార్యదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, పలువురు రాయబారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

సూడాన్‌లో సైన్యానికి, పారా మిలటరీ బలగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో అక్కడి భారతీయుల పరిస్ధితిపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. pic.twitter.com/2nG7bXcRmL

 

సూడాన్ అంతర్యుద్ధంలో 300 మందికి పైగా మృతి

సూడాన్ లో సైన్యానికి, పారామిలటరీ దళాలకు మధ్య జరిగిన ఘర్షణలో 300 మందికి పైగా మరణించారు. రాజధాని ఖర్టూమ్ లోని జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వైమానిక దాడులు, ట్యాంకుల్లో మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 50 లక్షల మంది ఆహారం, నీరు లేకుండా ఇళ్లలో దాక్కున్నారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్ కూడా దెబ్బతింది.

ఐక్య‌రాజ్య స‌మితి ఆందోళ‌న‌.. కాల్పుల విరమణ గురించి చ‌ర్చ‌లు 

సూడాన్ ప‌రిస్థితుల‌పై అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం అమెరికాలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూడాన్ లో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తోందన్నారు. కాల్పుల విరమణ జరిగి సేఫ్ కారిడార్ నిర్మిస్తే తప్ప మన ప్రజలను ఖాళీ చేయించడం సురక్షితం కాదని పేర్కొన్న‌ట్టు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని అక్కడున్న భార‌తీయుల కోసం తీసుకునే చ‌ర్య‌ల గురించి శుక్ర‌వారం ప్రారంభ‌మైన అత్యున్న‌త స్థాయి స‌మావేశంలో చ‌ర్చించిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

click me!