రైతు విజయగాథ: 80 ఏళ్ల కష్టం.. నెరవేరిన ‘‘బెంజ్ కల’’

First Published Jul 13, 2018, 12:01 PM IST
Highlights

చిన్నప్పుడు తాను చూచిన కారు కొనడానికి జీవితాంతం కష్టపడ్డాడు.. జీవితం ఇక అయిపోతుంది అనుకుంటున్న టైంలో తాను ముచ్చటపడిన కారును కొని కల నెరవేర్చుకున్నాడు 88 ఏళ్ల దేవరాజన్.

మనం చిన్నప్పుడు రోడ్ల వెంట నడిచేటప్పుడు కార్లు చూస్తుంటాం.. అబ్బా ఈ కారు మనకి కూడా ఉంటే ఎంత బాగుండో అనుకుంటాం.. కాసేపు అలా కలల్లో విహరించి ఆ తర్వాత పనుల్లో పడిపోతాం.. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న తాతయ్య అలా అనుకోలేదు.. చిన్నప్పుడు తాను చూచిన కారు కొనడానికి జీవితాంతం కష్టపడ్డాడు.. జీవితం ఇక అయిపోతుంది అనుకుంటున్న టైంలో తాను ముచ్చటపడిన కారును కొని కల నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పెద్దాయన విజయగాథ బాగా వైరల్ అవుతోంది.

తమిళనాడులోని కాంచీపురానికి చెందిన దేవరాజన్ ఎనిమిదేళ్ల వయసులో వీధుల వెంట నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మెర్సిడెజ్ బెంజ్ కారు కనిపించింది..  చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ కారును ఎలాగైనా కొనాలనుకున్నాడు.. పాపం ఆ చిన్నారికి కారు పేరేంటో  కూడా తెలియదు.. కేవలం లోగో ఒక్కటే గుర్తుంది.. అప్పటి నుంచి ఆ కారును సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు..

పేద కుటుంబంలో వ్యవసాయం చేస్తే కానీ పూట గడవని ఇంట్లో నుంచి వచ్చిన ఆ చిన్నారి అప్పటి నుంచి పైసా పైసా కూడబెట్టడం ప్రారంభించాడు... ఎంతో కష్టపడి రూ.33 లక్షలు పోగేశాడు.. 88 ఏళ్ల వయసులో తనకు ఎంతో ఇష్టమైన బెంజ్ కారును కొని తన కలను నెరవేర్చుకున్నాడు.. ఆయన కథ విన్న బెంజ్ షొరూం ప్రతినిథులు ఎంతో సంతోషపడ్డారు.. అప్పటికప్పుడు కేక్ తెప్పించి.. పెద్దాయనతో కట్ చేయించి.. సెలబ్రేట్ చేశారు..

ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల వయసులో నేను బెంజ్ కారును చూశాను.. జీవితంలో అలాంటి కారును చూడటం అదే మొదటిసారి.. కనీసం ఆ కారు పేరు కూడా నాకు తెలియదు.. కేవలం కారు లోగో మాత్రమే నచ్చింది.. దానిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్న నేను.... ఇవాళ దానిని నెరవేర్చుకున్నాను.. ఈ క్రెడిట్ అంతా నా భార్యదేనంటూ సంతోషంగా చెప్పాడు. అనుకున్నది సాధించడానికి ఎన్నేళ్లయినా విశ్రమించకుండా కృషి చేసిన రాజన్ ఎంతోమందికి స్పూర్తి..

click me!