మాక్‌డ్రిల్: భవనంపై నుంచి పడి బీబీఏ స్టూడెంట్ లోకేశ్వరీ మృతి

First Published Jul 13, 2018, 10:26 AM IST
Highlights

మాక్‌డ్రిల్‌లో సరైన రక్షణ చర్యలు తీసుకోని కారణంగా బీబీఏ స్టూడెంట్ లోకేశ్వరీ గురువారం నాడు మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చోటు చేసుకొంది. లోకేశ్వరీ మృతికి కారణమైన ట్రైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.


కోయంబత్తూరు: విపత్తులు జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన మాక్‌డ్రిల్ లోకేశ్వరీ అనే విద్యార్ధి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. సరైన రక్షణ చర్యలు తీసుకోని కారణంగా విద్యార్థి మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  

తమిళనాడు రాష్ట్రంలోని  కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవైకలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో  అగ్ని ప్రమాద సమయంలో  ఎలా వ్యవహరించాలనే దానిపై  కాలేజీలో  మాక్‌డ్రిల్  నిర్వహించారు.  చెన్నైకి చెందిన ఫైర్ సేఫ్టీ బృందం 20 మంది విద్యార్ధులను ఎంపిక చేసి 40 రోజులుగా శిక్షణ ఇచ్చారు. 

గురువారం మధ్యాహ్నం నాడు ఒక్కొక్కరిని రెండో అంతస్థు నుండి కిందకు దూకించారు. కింద వలలు ఏర్పాటు చేసిన మరికొందరు విద్యార్ధులు వారిని సురక్షితంగా  బయటపడేలా చేశారు. ఇదిలా ఉంటే  బీబీఏ విద్యార్ధి లోకేశ్వరీ  కిందకు దూకేందుకు భయపడింది. తాను ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొనబోనని తేల్చేసి చెప్పింది.

అయితే ఆమె భయపడుతోందని భావించిన  మాక్ డ్రిల్ నిర్వాహకులు లోకేశ్వరీని కిందకు తోసేశారు. అయితే ఆమె తల కింది ఫ్లోర్‌ గోడకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన  బాధితురాలు   అక్కడికక్కడే మృతి చెందింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందిందని  వైద్యులు ప్రకటించారు. లోకేశ్వరీ మృతికి కారణమైన  ట్రైనర్  ఆర్మగంను  పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

click me!