ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి .."దమ్ముంటే నా ముందుకు రండి": సీఎం

By sivanagaprasad KodatiFirst Published 3, Sep 2018, 11:42 AM IST
Highlights

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రాళ్ల దాడి జరిగింది. దీని నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం ప్రచారాన్ని ప్రారంభించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రాళ్ల దాడి జరిగింది. దీని నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటీవల తాను చేపట్టిన ‘ జన ఆశీర్వద యాత్ర’ కోసం ఉపయోగించిన బస్సునే ప్రచార రథంగా మార్చుకుని ఓ బహిరంగసభలో ప్రసంగించేందుకు నిన్న సిద్ధి జిల్లాలోని చుహాట్ ప్రాంతం మీదుగా వెళ్తున్నారు.

 

ఈ సమయంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు,  నల్లజెండాలు విసిరారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఆయనను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు. అయితే దీనిని వెనుక రాజకీయ కుట్ర దాగుందని సీఎం చౌహాన్ అభిప్రాయపడ్డారు.

రాళ్ల దాడి జరిగిన చుహాట్ ప్రాంతం ప్రతిపక్షనేత నేత అజయ్ సింగ్ నియోజకవర్గం కావడంతో ఇందుకు బలాన్నిస్తుంది. దాడి అనంతరం బహిరంగసభలో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహన్ ‘‘ అజయ్ సింగ్.. నీకు దమ్ముంటే బహిరంగంగా నా ముందుకు వచ్చి పోరాడు. నేను భౌతికంగా బలహీనుడిని కావొచ్చు.. కానీ నీ ఆటలు నా ముందు సాగవు... రాష్ట్ర ప్రజలు నాకు అండగా ఉన్నారు.. అంటూ సీఎం సవాల్ విసిరారు. 

Last Updated 9, Sep 2018, 2:06 PM IST