తమిళనాడులో తంజావూరులోని ఓ గ్రామంలో ఇంకా ఎస్సీలపై వివక్ష కొనసాగుతున్నది. షాపుల్లో వారికి ఏమీ అమ్మడం లేదు. హోటల్, సెలూన్లలోనూ వారి పట్ల వివక్ష ఉన్నది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
చెన్నై: తమిళనాడులో తంజావూరులోని ఓ గ్రామంలో ఇంకా అంటరానితనం పాటిస్తున్నట్టు బయటకు వచ్చింది. ఎస్సీలకు ఏమీ విక్రయించబోమని, ఇది ఈ ఊరు పెద్దలు నిర్ణయించిన కట్టడి అని ఓ దుకాణం యజమాని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
నవంబర్ 28వ తేదీన హిందూ కులాల పెద్దలు కొందరు పంచాయతీ పెట్టారు. ఆ సమావేశంలో గ్రామంలోని ఎస్సీలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీలకు ఏదీ అమ్మకూడదని దుకాణాలకు వారు ఆదేశాలు జారీ చేశారు. టీ స్టాల్‌లకు, సెలూన్లకు కూడా వారిని అనుమతించరాదని ఆజ్ఞలు జారీ చేశారు. ఫలితంగా అక్కడ ఎస్సీలకు ఏదీ విక్రయించడం లేదు. ఓ బైక్ రైడర్ ఆ గ్రామానికి వెళ్లి పెట్రోల్ కోసం ఓ దుకాణంలోకి వెళ్లాడు. పెట్రోల్ కావాలని అడిగాడు. షాపు నిర్వాహకుడు పెట్రోల్ పోయలేదు. ఆ పర్టికులర్ కులానికి ఏదీ విక్రయించబోమని, అది ఈ గ్రామ పెద్దల నిర్ణయం అని షాపు నిర్వాహకుడు సమాధానం ఇచ్చాడు.
undefined
Also Read: హిందువులుగా ఉన్నని రోజులు నువ్వు అంటరాని వాడివే.. డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పాపకాదు సమీపంలోని కేలమంగళం గ్రామంలో ఈ మూఢాచారం ఇంకా అమలు అవుతున్నది. విదుతలై చిరుతైగల్ కాచి ఎంపీ రవికుమార్ ఈ విషయాన్ని లేవనెత్తారు. రాష్ట్రంలో అంటరానితనాన్ని పాటిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాశశారు.
గ్రామ పరిపాలన అధికారి ఈ ఘటనపై దర్యాప్తు చేయగా.. ఎస్సీల పట్ల ఆ గ్రామంలో వివక్ష ఉన్నదని తేలింది. కేమెరాలో కనిపించిన షాప్ ఓనర్ వీరముత్తును పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఇతర సెక్షన్‌ల కింద అరెస్టు చేశారు. ఆ షాప్‌ను సీజ్ చేశారు.
అంతేకాదు, ఆ గ్రామంలో హోటళ్లలోనూ రెండు రకాల గ్లాసులు ఉన్నాయి. ఎస్సీ కమ్యూనిటీ వారి కోసం వేరే టీ గ్లాసులు వాడుతున్నారు. ఈ వివక్ష సెలూన్ షాపుల్లోనూ కనిపించింది. ఎస్సీలకు అందే చాలా రకాల సేవల్లో ఈ వివక్ష కొట్టొచ్చినట్టు కనిపించిందని తెలియవచ్చింది. కాగా, ఈ ఏరియాలో శాంతి భద్రతల కోసం పోలీసు సిబ్బంది మోహరించారు.