
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి అయిన ఆగస్ట్ 20న ఏఐసీసీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఢిల్లీలో ఆదివారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించాలని తీర్మానం చేశారు. జైపూర్‌లో చింతన్‌బైఠక్ నిర్వహించి.. వరుస ఓటములపై చర్చించాలని నిర్ణయించారు. అయితే రాహుల్ గాంధీ తిరిగి పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అంతకుముందు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం (AICC Office , Delhi) వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు (congress) ఆదివారం ఆందోళనకు దిగారు. సోనియా, రాహుల్ రాజీనామా చేయొద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సోనియా (sonia gandhi) , రాహుల్ (raghul gandhi) పార్టీ బాధ్యతలు చూసుకోవాలంటూ కార్యకర్తలు కోరుతున్నారు. సోనియా, రాహుల్ రాజీనామా చేస్తారంటూ వస్తోన్న వార్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీనియర్ నేత డీకే శివకుమార్ (dk shiva kumar) కోరుతున్నారు. అక్బర్ రోడ్ వద్దకు గాంధీ కుటుంబ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు రాజీనామాలు చేయవద్దంటూ యూత్ కాంగ్రెస్ లీడర్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇకపోతే.. సీడబ్ల్యూసీ సమావేశం హాట్ హాట్‌గా జరుగింది. పార్టీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని, జీ 23 అసమ్మతి నేతలు ఇప్పటికే హైకమాండ్‌ను డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను అధ్యక్షుడిగా నియమించాలని అసమ్మతి నేతలు సూచించినట్లు సమాచారం. గాంధీయేతర వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వస్తే.. ప్రస్తుతం ముకుల్ వాస్నిక్‌కే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం రాహుల్‌కే బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అలాగే జీ 23 నేతల డిమాండ్లు, పార్టీ సంస్థాగత ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందే తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కాగా.. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన ఫలితాలు ఆ పార్టీకి దక్కలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అసమ్మతి నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.