
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. కొత్త మంత్రివర్గం, ప్రభుత్వ ఏర్పాటు గురించి సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇప్పటికే ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చల్లో మునిగిపోయారు. కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలి? క్యాబినెట్‌లో మార్పు చేర్పుల గురించి బీజేపీ మేధోమధనం చేస్తున్నది. పార్టీకి చెందిన కొన్ని విశ్వసనీయవర్గాలు అందించిన సమాచారం మేరకు కొత్త క్యాబినెట్‌లో కొత్త ముఖాలు చాలా ఉండనున్నాయని, మరో ముఖ్య విషయం ఏమంటే.. డిప్యూటీ సీఎంగా దళిత వ్యక్తిని ఎంపిక చేయబోతున్నట్టు తెలిసింది. అంతేకాదు, డిప్యూటీ సీఎంల సంఖ్య కూడా పెంచాలనే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలో త్వరలో జరగబోయే కీలక సమావేశాల్లో వీటిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్‌లను కలిశారు. ప్రధాని మోడీతోనూ సాయంత్రం సమావేశం అయ్యారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ టాప్ నేతలతోనూ భేటీ కానున్నారు.
కొత్త క్యాబినెట్‌లో కుల, ప్రాంత ప్రాతినిధ్యాలను సమతుల్యం చేయాలని బీజేపీ భావిస్తున్నది. దీనికి ముందుగా పార్టీ పార్లమెంటరీ బోర్డు కొత్త ప్రభుత్వ ఏర్పాటును పర్యవేక్షించడానికి ఇద్దరు పర్యవేక్షకులను నియమించనుంది. యూపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో దళిత డిప్యూటీ సీఎం ఉండాలని ప్రాథమికంగా అనుకున్నట్టు తెలిసింది. అంతేకాదు, మంత్రివర్గంలో ఎక్కువ మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారినీ చేర్చుకోవాలనే ఆలోచనలు చేస్తున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
ఉత్తరప్రదేశ్‌లో 11 మంది మంత్రులు ఎన్నికల్లో ఓడిపోవడంతో క్యాబినెట్లు ఖాళీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి, అందులో కొత్త ముఖాలు ఎక్కువగా చేరే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గంలో కొత్తగా చేరే వారిలో కన్నౌజ్ నుంచి గెలుపొందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆసిమ్ అరుణ్, ఆగ్రా రూరల్ నుంచి గెలిచిన బేబీ రాణి మౌర్యలకు పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ స్వతంత్ర దేవ్ సింగ్, సరోజినీ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్, రిటైర్డ్ ఐఏఎస్, ఎమ్మెల్సీ ఏకే శర్మలనూ మంత్రులుగా చేసే అవకాశాలు ఉన్నాయి.
సిరాతు సీటు నుంచి ఓడిపోయిన యోగి డిప్యూటీ కేశవ్ ప్రసాద్ మౌర్యకూ క్యాబినెట్‌లో రెండోసారి అవకాశం ఇవ్వవచ్చు. ప్రాబల్యంగల ఓబీసీ నేత మౌర్య ఎమ్మెల్సీ కావడంతో ఈ నిర్ణయం సులువు కానుంది. అదే విధంగా మిత్రపక్షాలకూ మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు. అప్నా దళ్ నుంచి ఎమ్మెల్సీ ఆశిశ్ పటేల్, నిషద్ పార్టీ నుంచి డాక్టర్ సంజయ్ నిషద్‌లకూ మంత్రివర్గంలో చోటు ఇవ్వనున్నట్టు తెలిసింది.
ఇదిలాఉంటే.. ఆదిత్యనాథ్ శుక్రవారం లక్నోలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు తన రాజీనామాను సమర్పించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ఆదిత్యనాథ్ శుక్రవారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో తన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. యోగి ఆదిత్యనాథ్ తన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుండి 1,03,390 తేడాతో గెలుపొందారు. ఇటీవల జరిగిన UP అసెంబ్లీ ఎన్నికల్లో 62,109 ఓట్లతో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుభావతి ఉపేంద్ర దత్ శుక్లాపై విజయం సాధించారు. యూపీలో పూర్తి పదవీకాలం సీఎంగా ఉండి.. మరోసారి విజయం సాధించారు. దీంతో గత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నిల్చారు.