Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ!.. ఆహ్వానంపై దిగ్విజయ్ సింగ్ కామెంట్

By Mahesh K  |  First Published Dec 22, 2023, 3:13 PM IST

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీకి ఆహ్వానం అందింది. ఆమె అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావడానికి సుముఖంగా ఉన్నట్టు మరో నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
 


Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి నెల 22న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అనేక మంది ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి విపక్ష పార్టీ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధ్రువీకరించారు. ఆమె ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా? కారా? అనే విషయంపైనా ఆయన స్పందించారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లడానికి సోనియా గాంధీ సానుకూలంగా ఉన్నారని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆమె ఈ కార్యక్రమానికి వెళ్లుతారని చెప్పారు. ఒక వేళ ఆమె వెళ్లడం వీలుకాకపోతే.. ఆమె తరఫున ఓ ప్రతినిధిని ఈ కార్యక్రమానికి పంపుతారు అని వివరించారు.

Latest Videos

సోనియా గాంధీకి ఆహ్వానం అందింది అనే వార్తలు వచ్చాయి. కానీ, అధికారిక ధ్రువీకరణ ఏదీ రాలేదు. ఈ తరుణంలో దిగ్విజయ్ సింగ్ స్పందించి ధ్రువీకరించారు. అయితే, దిగ్విజయ్ సింగ్‌కు ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానం అందిందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బీజేపీ తనను ఆహ్వానించదు అని స్పష్టం చేశారు. ఎందుకంటే వారు నిజమైన భక్తులను గుర్తించలేరని వివరించారు. అందుక తనతోపాటు మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అడ్వాణీలకూ వారు ఆహ్వానం పంపలేదని అన్నారు.

Also Read: Gautam Adani: మీడియాలో అదానీ సామ్రాజ్య విస్తరణ.. మొన్న ఎన్డీటీవీ, నేడు ఏకంగా న్యూస్ ఏజెన్సీనే

వచ్చే నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రతిష్టాపించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నుంచి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీలకు ఆహ్వానం అందింది. వీరితోపాటు సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్‌, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి వంటి వారికీ ఆహ్వానం పంపారు.

click me!