Social Media: ‘సోషల్ మీడియా అరాచకమే.. దాన్ని నిషేధించాలి’

By telugu teamFirst Published Nov 16, 2021, 8:30 PM IST
Highlights

సోషల్ మీడియా అరాచకమైనదని, దాన్ని నిషేధించాలని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తుగ్లక్ వారపత్రిక ఎడిటర్ గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చైనా ఇప్పటికే సామాజిక మాధ్యమాలను నాశనం చేసిందని అన్నారు. సోషల్ మీడియా ఒక క్రమబద్ధమైన సమాజాన్ని నిర్మించడంలో ఆటంకం కల్పిస్తుందని వివరించారు.
 

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలు ఇటీవలి కాలంలో గణనీయమైన మార్పు తెచ్చాయి. సామాజిక సమస్యలను బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఒకరి అభిప్రాయాలను పంచుకోవడానికి, చర్చ చేయడానికి ఉపయోగపడ్డాయి. మిత్రులను సంపాదించుకోవడం, సోషలైజ్ కావడానికి కొంత ఉపకరించింది. మీడియా సంస్థలూ ఆయా కారణాలతో రిపోర్ట్ చేయని అంశాలనూ Social Media ఎక్స్‌పోజ్ చేసింది. ఇలాంటి సానుకూల(Positive) అంశాలు ఉన్నా.. ప్రతికూల అంశాలూ ఉన్నాయి. ఇప్పటికీ చాలా దేశాల్లో సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు, వదంతులు, విద్వేషం కూడా ప్రచారం అవుతున్నది. కొన్ని దేశాల్లో ఏకంగా ప్రజాస్వామ్యానికి కీలకమైన ఎన్నికలనే ప్రభావితం చేసినట్టు అభిప్రాయాలున్నాయి. ఇలాంటి సోషల్ మీడియాపై RSS సిద్ధాంతకర్త గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సామాజిక వేదికలు అరాచకతత్వాన్ని(Anarchic) కలిగి ఉన్నాయని, వాటిని నిషేధించే ఆలోచనలు చేయాలని గురుమూర్తి మంగళవారం అన్నారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ క్రమబద్ధమైన సమాజ మార్గంలో సోషల్ మీడియా ఒక ఆటంకంగా మారిందని అభిప్రాయపడ్డారు. చైనా ఇప్పటికే సోషల్ మీడియాను నాశనం చేసిందని పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియా పాత్రపై ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. అయితే, మనం ఇంకా సోషల్ మీడియాను బ్యాన్ చేయాల్సి ఉన్నదని అన్నారు. ఫేస్‌బుక్ లేకుండా మనం జీవించలేమా? అంటూ ప్రశ్నించారు. మయన్మార్, శ్రీలంక వంటి దేశాల్లో సోషల్ మీడియా అగ్గి రాజేస్తున్నదని పేర్కొంటూ సోషల్ మీడియాపై నిషేధం విధించాలనే ఆలోచనను తెచ్చారు. తమిళ రాజకీయ వార పత్రిక తుగ్లక్ మ్యాగజైన్‌కు గురుమూర్తి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లలో కొత్త బ్రాండింగ్.. అసలు మెటావర్స్ అంటే ఏంటి ?

అయితే, అదే సమావేశంలో ఉన్న ఇతరులు కొందరు గురుమూర్తి అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ఆయన ఆలోచనలను ఖండించారు. గురుమూర్తి ప్రసంగంపై కొందరు ప్రశ్నలు వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వాటికి సమాధనం చెబుతూ.. బ్యాన్ అనేది చాలా గంభీరమైన పదం తరహా వినిపిస్తున్నదేమో కానీ, అరాచకతత్వమున్న వాటిని నిషేధించాలనే తాను నమ్ముతున్నట్టు తెలిపారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికల పాత్రను సంగ్రహంగా పరిశీలించి ఓ డాక్యుమెంటేషన్ చేయాలని ఆయన కౌన్సిల్‌ను కోరారు.

Also Read: ట్రూత్ సోషల్.. సొంత సోషల్ నెట్‌వర్క్‌పై క్లారిటీ ఇచ్చిన ట్రంప్.. అన్నంత పని చేసేశాడు..

‘మీరు అరాచకాన్ని కీర్తించవచ్చు. విప్లవాలు, ఊచకోతల్లోనూ కొంత మంచి ఉండవచ్చు. కానీ, ఆ విధానాల్లో ఒక క్రమబద్ధమైన సమాజాన్ని మీరు తయారు చేయలేరు’ అని గురుమూర్తి అన్నారు. కాగా, గురుమూర్తితో విబేధించిన కౌన్సిల్ సభ్యుల్లో జైశంకర్ గుప్తా, గుర్బీర్ సింగ్‌లు ఉన్నారు. ప్రతి శకం దానికి అదిగా ఒక కొత్త నిర్మాణాన్ని కలిగి ఉంటుందని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నదని తెలిపారు. దీనితో చాలా సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పారు. చాలా మార్గాల్లోనే సోషల్ మీడియా గణనీయంగా ఉపకరిస్తున్నదనీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ వేదికలను అంగీకరించాలని, వాటిని నిర్మూలించాలని భావించడం భావ్యం కాదని తెలిపారు.

click me!