కారును ఢీకొట్టి పాదాచారుల మీదకు దూసుకెళ్లిన హై స్పీడ్ ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం

By Mahesh KFirst Published Jan 22, 2023, 9:13 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ హై స్పీడ్ డంపర్ ట్రక్కు కారును ఢీకొట్టింది. ఆ తర్వాత అది హై వే పక్కన నడుస్తున్న పాదాచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందినట్టు తెలిసింది. కారులో మరో నలుగురైదుగురు చిక్కుకున్నట్టు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదంలో హై వే పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్లుతున్న ఆరుగురు ప్రాణాలు పోయాయి. ఏం జరుగుతుందో కూడా వారికి తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హై స్పీడ్‌తో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు పట్టు తప్పింది. కారును బలంగా ఢీ కొట్టింది. అయినా, దాని వేగం తగ్గి నియంత్రణలోకి రాలేదు. అదుపు తప్పి అక్కడే రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లుతున్న వారి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ సహా ఆరుగురు దారుణంగా మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని ఉన్నావ్‌లో ఆదివారం జరిగింది. 

అతి వేగంగా వస్తున్న ఆ ట్రక్కు కారును ఢీ కొట్టి పాదాచారుల పై నుంచి దూసుకెళ్లి రోడ్డు పక్కనే లోయ తరహా లో ఉన్న కందకంలోకి వెళ్లి పడింది. ఆ ట్రక్కు ఢీ కొన్న కారులో నలుగురి నుంచి ఐదుగురు చిక్కుకుని ఉంటారని తెలుస్తున్నది. వారిని కాపాడటానికి క్రేన్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నది.

Also Read: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం.. చెట్టును ఢీకొట్టిన తర్వాత కారులో చెలరేగిన మంటలు

ఘటన గురించి తెలియగానే స్థానిక పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. ఘటనా స్థలికి ఏఎస్పీ శశి శేఖర్ సింగ్ వెళ్లారు. లక్నో -  కాన్పూర్ హై వే సమీపంలోని అచల్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

click me!