గోవధ ఆపేస్తే భూమిపై అన్ని సమస్యలు సమసిపోతాయి.. ఆవుపేడ అటామిక్ రేడియేషన్‌ను అడ్డుకుంటుంది:గుజరాత్ కోర్టు సంచలనం

By Mahesh KFirst Published Jan 22, 2023, 8:48 PM IST
Highlights

గోవధ ఆపివేస్తే భూమి పై ఉన్న రుగ్మతలు అన్ని సమసిపోతాయని గుజరాత్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవు పేడతో నిర్మించిన ఇల్లు అటామిక్ రేడియేషన్‌ను కూడా అడ్డుకుంటుందని పేర్కొంది. ఎన్నో విరుగుడు లేని వ్యాధులను గోమూత్ర నయం చేస్తుందని వివరించింది.
 

అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఓ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గోవధ పై సైన్స్‌కు విరుద్ధంగా వ్యాఖ్యానించింది. అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ గోవధ గురించి తాపి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జీ మాట్లాడారు. గోవధను ఆపేస్తే భూమిపై ఉన్న అన్ని సమస్యలు సమసిపోతాయని అన్నారు.

జడ్జీ సమీర్ వినోద్ చంద్ర మాట్లాడుతూ, గోవు పేడతో కట్టిన ఇల్లు అణు రేడియోధార్మికతను కూడా అడ్డుకుంటుందని తెలిపారు. విరుగుడే లేని ఎన్నో వ్యాధులను గోమూత్రం నయం చేస్తుందని వివరించారు. అసలు మతమే గోవు నుంచి పుట్టిందని అన్నారు.

న్యాయమూర్తి వ్యాఖ్యలకు శాస్త్ర ఆధారాలేవీ లేవు.

నవంబర్‌లో వెలువరించిన ఈ తీర్పు గో రక్షణ కోసం మాట్లాడుతున్న ఎన్నో నిబంధనలను ఆచరణలో పెట్టలేకపోతున్నారని వివరించారు.

‘గోవు కేవలం ఒక పశువు మాత్రమే కాదు. ఒక మాత. 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతలకు ఆవాసమైన ఒక సజీవ గ్రహం గోవు. మొత్తం ఈ విశ్వంలో గోవుకు ఉన్న బాధ్యతను వివరించలేం’ అని తెలిపారు.

Also Read: ఇప్పటి వరకు ఐదుగురిని చంపేశాం.. మూకదాడులపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్

పలు శ్లోకాలను ఉటంకిస్తూ గోవును సంతోషంగా ఉంచలేకపోతే సంపద, ఆస్తులు అన్నీ కనుమరుగైపోతాయని ఆ కోర్టు పేర్కొంది.

అంతేకాదు, గోవధను ఆ న్యాయమూర్తి పర్యావరణ మార్పులకూ ముడిపెట్టారు. నేడు భూమి ఉష్ణోగ్రత పెరగడం ప్రధాన సమస్యగా ఉన్నదని, దీనికి ఒకే ఒక కారణం గోవధ అని అన్నారు. గోవధను పూర్తిగా లేకుండా చేసే వరకూ పర్యావరణ సమస్యల ప్రభావం తప్పక ఉంటుందని వివరించారు. 

గత ఏడాది ఆగస్టులో 16 గోవులను అక్రమంగా తరలిస్తున్న కేసు కు సంబంధించి ఈ కోర్టు విచారించింది. దోషికి జీవిత ఖైదు విధించడంతపాటు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది. ఈ కోర్టు తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. చర్చనీయాంశమైంది.

click me!