
ఇంటి వద్దకే BLOలు, పత్రాల సేకరణ
SIR నోటీసు అందుకున్న ఓటర్లకు ప్రక్రియను సులభతరం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచితే.. వాటిని పరిశీలించేందుకు BLOలు ఓటర్ల నివాసానికి వెళ్లనున్నారు. పత్రాలను సేకరించిన తర్వాత వాటిని ECINET వ్యవస్థలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యత కూడా BLOలదే. దీంతో నోటీసు వచ్చిన ప్రతి వ్యక్తి ఎన్నికల కార్యాలయం లేదా BLOను వెతుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా వృద్ధులు, బయటకు వెళ్లలేని వారు, ఇతర కారణాలతో కార్యాలయాలకు చేరుకోలేని ఓటర్లకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంది.
వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు
SIR నోటీసు అందుకున్నవారంతా వ్యక్తిగత విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలనే నిబంధనను ఈసీ సడలించింది. సాధారణ కేసుల్లో సంబంధిత పత్రాలను BLO ద్వారా అందించడం సరిపోతుందని తెలిపింది. అయితే అవసరమైన సందర్భాల్లో మాత్రమే వ్యక్తిగత విచారణకు పిలిచే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అర్హతకు సంబంధించిన వివరాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) తీసుకుంటారు. అంటే BLOలు పత్రాలను సేకరించి, ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారు కానీ ఓటరు అర్హతపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ERO వద్దే ఉంటుంది.
A press note from the Election Commission of India (@ECISVEEP) reads:
The meeting of the Commission was held today i.e. 26.09.2026 at 3:00 PM. The following decisions were taken in the meeting:
i. In case of any person to whom notice has been issued during the ongoing SIR, for… pic.twitter.com/4Axd8wEOVM— Press Trust of India (@PTI_News) September 26, 2026
Form-6 డిక్లరేషన్‌పైనా ఈసీ స్పష్టత
SIR ప్రక్రియలో అవసరమైన సందర్భాల్లో Form-6తో పాటు సంబంధిత డిక్లరేషన్‌ను సమర్పించే విధానాన్ని కూడా ఈసీ సమర్థించింది. ఓటర్ల నమోదు, అర్హత నిర్ధారణకు సంబంధించిన ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని ఎన్నికల సంఘం తన తాజా ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారిక ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో SIR-2026 కోసం నోటీసుకు సంబంధించిన పత్రాలను సమర్పించే సదుపాయం, Form-6, డిక్లరేషన్ ఫారమ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఢిల్లీ, మహారాష్ట్ర గడువుల్లో మార్పులు
SIRకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో గడువులను కూడా ఎన్నికల సంఘం సవరించింది. తాజా రిపోర్టుల ప్రకారం ఢిల్లీలో అభ్యంతరాలు, క్లెయిమ్‌ల ప్రక్రియకు గడువును అక్టోబర్ 30 వరకు పొడిగించారు. మహారాష్ట్రలో ఈ గడువు అక్టోబర్ 12 వరకు కొనసాగనుంది.
ముగ్గురు కమిషనర్ల సమావేశం.. విభేదాలపై ఈసీ వివరణ
న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో శనివారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కూడిన పూర్తి కమిషన్ సమావేశమైంది. SIRపై అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే SIRకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని ఈసీ స్పష్టం చేసింది. SIRపై వస్తున్న అభ్యంతరాలు, ఓటర్ల జాబితా సవరణ, నోటీసుల ప్రక్రియ వంటి అంశాలపై ఎన్నికల సంఘం తన తాజా వైఖరిని వెల్లడించింది. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లకు వ్యక్తిగతంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన భారం తగ్గించడంతో పాటు, పత్రాల పరిశీలనను ఇంటి వద్దే నిర్వహించే అవకాశం ఏర్పడింది.