
SIR ప్రక్రియలో గైర్హాజరు, వలస, మరణం, డూప్లికేట్ ఓటర్లుగా (ASDD) గుర్తించిన కారణాలతో ముసాయిదా ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు కనిపించలేదు. ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడంతో అర్హులైన ఓటర్లు కూడా జాబితాలో చోటు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి మరోసారి నమోదు చేసుకునే అవకాశం ఇవ్వాలని ఈసీ నిర్ణయించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ వెసులుబాటు అమలు చేయనున్నారు. అర్హత ఉన్నవారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించి తమ ఓటు హక్కును పొందవచ్చు.
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇందుకోసం సంబంధిత పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో ASDD జాబితాలను మరోసారి ప్రదర్శించాలి. ఓటర్ల పేర్లు తొలగించడానికి లేదా చేర్చకపోవడానికి గల కారణాలను కూడా స్పష్టంగా తెలియజేయాలి. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (CEO) అధికారిక వెబ్‌సైట్లలో ఈ జాబితాలను PDF రూపంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. సంబంధిత ఓటర్లకు పాక్షికంగా వివరాలు నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను ECINET ద్వారా మరోసారి రూపొందించనున్నట్లు వెల్లడించింది.
అర్హులైన ఓటర్లను గుర్తించి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసే బాధ్యతను బూత్ స్థాయి అధికారులు (BLO) చేపట్టాలని ఈసీ సూచించింది. వారు ఇంటింటికీ వెళ్లి సంబంధిత వ్యక్తులను సంప్రదించాలి. అవసరమైతే వాట్సాప్, ఈ-మెయిల్, SMS ద్వారా కూడా ఫారాలు పంపించవచ్చు. ఓటర్లు తమ పాత EPIC నంబర్‌ను ఉపయోగించి ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లేదా ECINET యాప్ నుంచి ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో అదే నివాసంలో కొనసాగుతున్నవారు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ అనుబంధం-B ప్రకటనను సమర్పించాలి.
రాష్ట్రంలోని మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్నవారు పాత ప్రాంతంలో ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గ వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాలి. దీనికి అనుబంధం-C ప్రకటనతో పాటు కొత్త చిరునామాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కొత్త ప్రాంతంలోని BLOను సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చు. ఇక ఇల్లు లేని వారికి చిరునామా ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోయినా ఇబ్బంది లేదని ఎన్నికల సంఘం తెలిపింది. అలాంటి సందర్భాల్లో BLO క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలన నివేదిక ఆధారంగా వివరాలను ధ్రువీకరించవచ్చు. ECINET యాప్‌లో BLOతో మాట్లాడేందుకు 'mBook a Call with BLO' సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు.
ఓటర్లు సమర్పించిన ఫారాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ERO) పరిశీలిస్తారు. దరఖాస్తుదారుల అర్హత, సాధారణ నివాసం తదితర వివరాలను ధ్రువీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఆమోదం పొందిన దరఖాస్తులను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. గతంలో కేటాయించిన EPIC నంబర్‌నే తిరిగి ఇవ్వాలని సూచించింది. మరోవైపు, SIR ప్రక్రియలో కొత్త ఓటు నమోదు కోసం ఇప్పటికే ఫారం-6 సమర్పించిన వారు తిరిగి ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కొత్త అవకాశంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎన్నికల అధికారులకు సూచించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి పవన్ దివాన్ సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినంత మాత్రాన ఓటు హక్కు కోల్పోయినట్లు కాదని, నిర్దేశించిన విధానంలో దరఖాస్తు చేసుకుని అర్హత నిరూపించుకుంటే తుది జాబితాలో పేరు పొందవచ్చని స్పష్టం చేసింది.