
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ‘చలో ఢిల్లీ’ పేరుతో నిర్వహించిన ర్యాలీకి వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత కాన్స్టిట్యూషన్ క్లబ్ వద్ద సమావేశమైన కూటమి ఎంపీలు, అనంతరం ర్యాలీగా బయలుదేరి రాంలీలా మైదానానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.
ఇండియా కూటమి నిరసనకు పోటీగా బీజేపీ పశ్చిమ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించింది. 1984లో సిక్కులపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, ఆ ఘటనలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ర్యాలీ నిర్వహిస్తున్న రోజునే సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం చేయాలనే నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. హరినగర్ బస్ డిపో నుంచి ప్రారంభమైన బీజేపీ ర్యాలీ తిలక్ నగర్ మెట్రో స్టేషన్ వరకు కొనసాగింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, మన్జీందర్ సింగ్ సిర్సా, బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. 1984 అల్లర్లలో బాధితులైన కుటుంబ సభ్యులు కూడా నిరసనలో భాగమయ్యారు.
ఆనాటి ఘటనలను గుర్తుచేసుకున్న హర్దీప్ సింగ్ పురి.. సిక్కులపై జరిగిన దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులను హిందూ స్నేహితులు ఎలా రక్షించారో వివరించారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 2,733 మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
#WATCH | Delhi: On the INDIA bloc mega rally, Union Minsiter JP Nadda says, "What is unfolding today at Ramlila Maidan is not an act of respect for democracy; rather, it is a calculated conspiracy to plunge the nation into anarchy—in the name of democracy. This is a foolish, orchestrated drama staged by those who have been defeated and repeatedly rejected by the people—a fact the public understands all too well. Rahul Gandhi, I wish to explain to the nation today what your model of politics entails: the first stage is spreading lies and rumours; the second is inciting anarchy and chaos on the streets; the third is damaging the nation’s economy; and the fourth is attempting to destabilise an elected government at the behest of foreign powers. This drama by Rahul Gandhi on November 1st has four objectives: first, to rub salt into the wounds of our Sikh brothers; second, to orchestrate riots and chaos in Delhi in order to topple a democratically elected government; third, to rob the shopkeepers and traders of Delhi of their earnings during the festive season; and fourth, to bring disrepute to the nation..."
— ANI (@ANI) November 1, 2026
రెండు పార్టీల ర్యాలీల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కీలక ప్రాంతాల్లో పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. ర్యాలీ మార్గాలు, సభా ప్రాంగణాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాంలీలా మైదానంలో జరిగే ఇండియా కూటమి సభకు 40 వేల నుంచి 50 వేల మంది వరకు హాజరుకావచ్చని అంచనా వేయడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
సభా ప్రాంగణాన్ని 14 జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఏసీపీ స్థాయి అధికారిని బాధ్యుడిగా నియమించారు. అదనపు డీసీపీ స్థాయి అధికారులు మొత్తం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 250కి పైగా హై-డెఫినిషన్, ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్ల ద్వారా పరిసర ప్రాంతాలను గమనించే ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ కూడా ముందుగానే రాంలీలా మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ర్యాలీ నిర్వాహకులు పోలీసుల నిబంధనలను పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. సభకు నిర్ణీత సమయాల్లోనే అనుమతి ఇచ్చినట్లు పేర్కొంటూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని సూచించారు. పాల్గొనేవారికి తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
#WATCH | Rohtak, Haryana: BJP organises 'Loktantra Bachao, Arajakta Hatao' (Save Democracy, Remove Anarchy) march under the leadership of BJP National President Nitin Nabin. https://t.co/eHVwwGEXfL
— ANI (@ANI) November 1, 2026
ర్యాలీల కారణంగా మధ్య ఢిల్లీలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. రాజ్‌ఘాట్, ఢిల్లీ గేట్, ఐటీవో, అజ్మేరీ గేట్ పరిసరాల్లో వాహనాలను దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు. బహదూర్ షా జఫర్ మార్గ్, జవహర్లాల్ నెహ్రూ మార్గ్, బారాఖంబా రోడ్ సహా కీలక రహదారులపై రద్దీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కనౌట్ ప్లేస్, జంతర్ మంతర్, భగవాన్ దాస్ రోడ్, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. ర్యాలీ మార్గాల్లో ప్రయాణించేవారు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, వీలైనంతవరకు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అదే సమయంలో ఎల్ఎన్జేపీ, జీబీ పంత్ ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్సులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi, Congress MP Priyanka Gandhi Vadra, National Conference MP Farooq Abdullah, Samajwadi Party Chief Akhilesh Yadav, NCP-SCP MP Supriya Sule, TMC leader Mamata Banerjee, RJD leader Tejashwi Yadav, and others move towards Ramlila Maidan for INDIA bloc's mega rally.
— ANI (@ANI) November 1, 2026
దీపావళి పండుగ సీజన్లో రాజకీయ ర్యాలీల నిర్వహణపై ఢిల్లీలోని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ కొనుగోళ్లతో వ్యాపారాలు ఊపందుకుంటున్న సమయంలో రోడ్లపై ఆంక్షలు, ట్రాఫిక్ రద్దీ కారణంగా వినియోగదారులు దుకాణాలకు రావడం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఆటోమొబైల్ పార్ట్స్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ నారంగ్ మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కును గౌరవిస్తున్నామని, అయితే ర్యాలీలకు ఎంచుకున్న సమయం, ప్రాంతంపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. పండుగ సమయంలో వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, ఇండియా కూటమి ర్యాలీకి తెలంగాణ నుంచి హాజరయ్యే కార్యకర్తల రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. మొత్తంగా ఓటర్ల జాబితా సవరణ అంశం, 1984 సిక్కుల ఊచకోత ఉదంతం కేంద్రంగా సాగుతోన్న ఈ రెండు ర్యాలీలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవైపు ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు గత ఘటనలను ప్రస్తావిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.