
ఓ ఒంటరి మహిళ తన బిడ్డ కోసం పోరాటం చేసింది. అది దేనికోసమో తెలుసా? తన కొడుకు పాస్ పోర్టులో తండ్రి పేరును తొలగించాలి అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన ఢిల్లీ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మన దేశంలో ప్రతి గుర్తింపు కార్డులో కచ్చితంగా తండ్రి పేరు అడుగుతారు. అంతేకాదు, తండ్రి ఇంటిపేరే పిల్లలకు వస్తుంది. కానీ, ఓ మహిళ తన భర్త నుంచి దూరమైంది. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. బిడ్డ సంరక్షణ మొత్తం తల్లే చూసుకుంటోంది. మరి అలాంటప్పుడు పాస్ పోర్టులో తండ్రి పేరు ఎందుకు ఉండాలి..? ఇదే ప్రశ్న ఓ మహిళకు ఎదురైంది. తన మైనర్ కొడుకు పాస్ పోర్టులో తండ్రి పేరు తొలగించాలని, అసలు తండ్రి పేరు అనే కాలమ్ లేకుండా చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించింది.
తన కొడుకు పుట్టకముందే భర్త తనను వదిలిపెట్టాడని, అలాంటి భర్త పేరు తన కొడుకు ఎందుకు మోయాలి అనేది ఆమె వాదన. కాగా, ఆమె పిటిషన్ ని పరిశీలించిన న్యాయస్థానం చాలా పాజిటివ్ గా స్పందించింది. ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆమె మైనర్ కొడుకు పాస్‌పోర్ట్ నుండి తండ్రి పేరును తొలగించాలని పాస్‌పోర్ట్ అధికారులను ఆదేశించింది. ఆ బాలుడిని తన తండ్రి పుట్టకముందే విడిచిపెట్టాడని, బిడ్డను ఆమె ఒంటరిగా పెంచిందని న్యాయస్థానం పేర్కొంది.
వాస్తవానికి, ఇది తండ్రి బిడ్డను పూర్తిగా విడిచిపెట్టిన కేసు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసు ప్రత్యేకమైన, విచిత్రమైన పరిస్థితులలో, తదనుగుణంగా పాస్‌పోర్ట్ నుండి పిల్లల తండ్రి పేరును తొలగించి, తండ్రి పేరు లేకుండా మైనర్ బిడ్డకు అనుకూలంగా పాస్‌పోర్ట్ మళ్లీ జారీ చేయాలని నిర్దేశించారు. కొన్ని పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించవచ్చని, ఇంటిపేరును కూడా మార్చుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.
"తల్లిదండ్రుల మధ్య వైవాహిక విభేదాల విషయంలో అనేక పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ పిల్లల పాస్‌పోర్ట్ దరఖాస్తును అధికారులు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది" అని కోర్టు పేర్కొంది.