Sikkim Floods: 40కి చేరిన మృతుల సంఖ్య .. ఇంకా 76 మంది అదృశ్యం..

Google News Follow Us

సారాంశం

Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 40కి పెరిగింది. ఈ విపత్తు జరిగిన రెండు వారాల తర్వాత కూడా 76 మంది జాడ తెలియ రాలేదని అధికారులు తెలిపారు.

Sikkim Floods: సిక్కింలోని లొనాక్ సరస్సుపై మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు మృతదేహాలను కనుగొన్నారు. దీంతో సిక్కింలో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 40కి పెరిగింది. విపత్తు జరిగిన దాదాపు రెండు వారాల గడుస్తున్న ఇప్పటికీ 76 మంది ఆచూకీ లభ్యం కాలేదు.

అక్టోబరు 4 తెల్లవారుజామున మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నదిలో ఆకస్మిక వరదలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి. సుమారు 88,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. చాలా మృతదేహాలు పాక్యోంగ్‌లో లభ్యమయ్యాయి. సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SSDMA) ప్రకారం.. జిల్లాలో 26 మృతదేహాలు కనుగొనబడ్డాయి. 15 మంది పౌరులు కాగా, 11 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. మంగన్‌లో నాలుగు, గాంగ్‌టక్‌లో ఎనిమిది, నామ్చిలో రెండు మృతదేహాలు లభ్యమైనట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో అనేక మృతదేహాలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. తప్పిపోయిన 76 మందిలో 28 మంది పాక్యోంగ్‌కు చెందినవారు, 23 మంది గ్యాంగ్‌టక్‌కు చెందినవారు, 20 మంది మంగన్‌కు చెందినవారు, ఐదుగురు నామ్చికి చెందినవారిగా గుర్తించారు.  

అలాగే.. ప్రస్తుతం రాష్ట్రంలో 20 సహాయ శిబిరాలు పనిచేస్తున్నాయని, అందులో 2,080 మంది ఆశ్రయం పొందారని SSDMA తెలిపింది.జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం.. ఉత్తర సిక్కింలోని సౌత్ ల్హోనాక్ సరస్సు వద్ద అధిక వర్షపాతం, గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ (GLOF) సంఘటన కారణంగా ఆకస్మిక వరదలు సంభవించినట్టు తెలుస్తోంది.