భారత్‌లో వ్యాక్సినేషన్‌... 2, 3 నెలల్లో కష్టమే, మూడేళ్లు పక్కా : పూనావాలా సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 18, 2021, 7:54 PM IST
Highlights

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ఇప్పుడే పూర్తి కాదని వ్యాఖ్యానించారు.

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ఇప్పుడే పూర్తి కాదని వ్యాఖ్యానించారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమని.. ఇంత పెద్ద దేశంలో 2, 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి కావడం కష్టమని పూనావాలా అభిప్రాయపడ్డారు.

ఇంత పెద్ద దేశంలో వ్యాక్సినేషన్ అందరికీ జరగాలంటే రెండు, మూడేళ్లు పడుతుందని ఆయన అన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాలు ఉన్నప్పటికీ భారత్‌కే తొలి ప్రాధాన్యం వుందని పూనావాలా చెప్పారు. వ్యాక్సినేషన్‌కు అనేక సవాళ్లు వున్నాయని అధర్ తెలిపారు. 

కొందరు సీఎంలు తనను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పూనావాలా వ్యాఖ్యానించారు. అందుకే యూకే వెళ్లానని.. ఇప్పట్లో ఇండియాకు రానని ఆయన స్పష్టం చేశారు. పుణే ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నామని పూనావాలా పేర్కొన్నారు.

మరోవైపు పూనావాలా భారత్​కు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు నానా పటోలే. పూనావాలాకు భద్రతకు తమ పార్టీ బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. అంతకుముందు కేంద్రం ప్రభుత్వం అదర్ పూనావాలాకు వై కేటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే.

దీని కింద ఆయనకు ఇద్దరు కమెండోలతో పాటు 11 మంది పోలీసు సిబ్బంది భద్రతగా వుండనున్నారు. అదర్ పూనావాలాకు భద్రత కల్పించాలని కోరుతూ సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. 

click me!