
Karnataka CM Decision: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. సీఎంగా ఎవరిని నియమించాలనే అంశంపై నిర్ణయం తేలడం లేదు. ఇద్దరూ కీలక నేతలే కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా డైలామాలో పడింది. కర్ణాటక సీఎం ఎంపికపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లూ వేర్వేరుగా మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ సిద్దరామయ్య వైపే మొగ్గు చూపినట్టు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఖర్గేతో భేటీ అయ్యారు.
కర్ణాటకలో అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనను ముందు ఉంచగా.. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు తిరస్కరించినట్టు తెలిసింది. సీఎంగా ఎవరినైనా ఒకరినే నియమించాలని, ఐదేళ్ల కాలాన్ని తాము పంచుకోవాలన్న ప్రతిపాదనను స్పష్టంగా వారు తిరస్కరించినట్టు కొన్ని వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లను సీఎంగా ఎంచుకునే విషయాల్లో ఎమ్మెల్యేలు కూడా న్యూట్రల్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే డీకే శివకుమార్ వైపు ఉన్న ఎమ్మెల్యేల కోసం సిద్దరామయ్య కూడా ప్రచారం చేశారు.
Also Read: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య? రాహుల్ గాంధీ మద్దతు ఆయనకే! సీఎం రేసులో ముందంజ
కర్ణాటక సీఎం నిర్ణయం ఇవాళ తేలేలా లేదు. సీఎం ఎవరన్నది ఖరారు చేయడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకంటే.. వీరిలో ఎవరిని సీఎంగా ఎంచుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆయన ఇంకా పలువురు నేతలతో సమావేశాలు నిర్వహించబోతున్నట్టు తెలిసింది.
కర్ణాటక సీఎంను నిర్ణయించడంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. మల్లికార్జున్ ఖర్గే నిర్ణయానికే లోబడి ఉండనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. సీఎం పోస్టు తనకు ఆఫర్ చేస్తే స్వీకరిస్తా అని కాంగ్రెస్ నేత జీ పరమేశ్వర తెలిపారు. తన పని, తాను చేసిన సేవల గురించి కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలుసు అని అన్నారు. అందుకే సీఎం పోస్టు కోసం తాను లాబీ చేయాల్సిన అవసరం లేదని వివరించారు. తాను పార్టీ సీనియర్ నేతలను నమ్ముతానని అన్నారు. అందుకే హైకమాండ్ తనకు అవకాశం ఇస్తే మాత్రం తాను తప్పక స్వీకరిస్తానని ఇది వరకే చెప్పానని గుర్తు చేశారు.