
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో భయంకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు శనివారం మొహరౌలీ అడవిలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రద్ధను హత్య చేసిన అఫ్తాబ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అడవిలో సెర్చ్ చేసిన పోలీసులు.. మరొక నాలుగు ఎముకలను గుర్తించారు. సోమవారం అఫ్తాబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
అఫ్తాబ్ తనతో కలిసి సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశారు. అందులో కొన్నింటిని మొహరౌలీ ఫారెస్ట్‌లో పడేశాడు. శ్రద్ధను హత్య చేసిన తర్వాత 20 రోజుల సమయంలో ఇలా వివిధ ప్రదేశాల్లో శరీర భాగాలను విసిరేశాడు. విషయం వెలుగులోకి వచ్చాక ఈ సోమవారం అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా మొహరౌలీ అడవిలో ఆధారాల కోసం శోధిస్తున్నారు. నవంబర్ 16 నుంచి మొత్తం మూడు సార్లు పోలీసులు అటవీ ప్రాంతంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు. శనివారం ఉదయం ఆరు గంటలకే మొహరౌలీ అటవీ ప్రాంతానికి చేరుకుని శ్రద్ధ ఎముకలను సేకరించారు.
ALso Read:శ్రద్దా హత్య కేసు: అఫ్తాబ్ అన్ని నీళ్లు ఎందుకోసం వాడాడు.. అధిక నీటి బిల్లు పోలీసులకు ఆధారం కానుందా?
మరోవైపు... ఈ కేసు విచారణ జరుపుతున్న అధికారులు.. అఫ్తాబ్ నివాసం ఉంటున్న అద్దె ఇంటికి అధిక వాటర్ బిల్లు రావడంపై దృష్టి సారించారు. నెలకు 20,000 ఉచిత నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ.. అఫ్తాబ్ ఉంటున్న ఇంటికి రూ. 300 బిల్లు వచ్చింది. దీంతో పోలీసులు అఫ్తాబ్ అంత పెద్ద మొత్తంలో నీటిని ఎందుకు వినియోగించాడనే అంశంపై విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది.
అయితే అఫ్తాబ్ నివాసం ఉంటున్న కాలనీలోని చాలా ఇళ్లకు 20,000 లీటర్లు.. రోజుకు దాదాపు 35 బకెట్లు.. అంటే కుటుంబానికి సరిపోయే దానికంటే ఎక్కువ. దీంతో చాలా మందికి జీరో వాటర్ బిల్లు వస్తుంది. అయితే అఫ్తాబ్ ఇంటికి రూ. 300 వాటర్ బిల్లు ఎలా వచ్చి ఉంటుందని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, అఫ్తాబ్-శ్రద్ధా వాకర్ జంట మే 14న అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోకి మారారు. అయితే శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన మే 18 నుంచి అక్కడ అఫ్తాబ్ ఒంటరిగా నివసిస్తున్నట్లు విచారణలో తేలింది.
యువతి శరీర భాగాలను కత్తిరించే సమయంలో వచ్చే శబ్దం బయటకు వినిపించకుండా ఉండేందుకు ట్యాప్‌ను ఆన్ చేసి ఉంచడం, శరీరంలోని రక్తాన్ని కడగడానికి వేడినీరు, ఫ్లాట్‌లోని మరకలను తొలగించడానికి నీటిలో రసాయనాలు కలపడం.. వంటివి చేయడం వల్ల రూ. 300 వాటర్ బిల్లు పెండింగ్లో ఉందని ఈ కేసును విచారణ జరుపుతున్న వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా విచారణలో ఒక ఆధారంగా మారే అవకాశం ఉంది.