Gujarat Elections: మోర్బి బ్రిడ్జీ ప్రమాదానికి ప్రభుత్వ బాధ్యత లేదు: మోర్బి బీజేపీ అభ్యర్థి ఏమంటున్నాడంటే?

By Mahesh KFirst Published Nov 19, 2022, 7:19 PM IST
Highlights

మోర్బి బ్రిడ్జీ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించదని ప్రజలకు తెలుసు అని మోర్బి సీటు నుంచి బీజేపీ టికెట్ పై పని చేస్తున్న అభ్యర్థి కాంతిలాల్ అమృతియా అన్నారు. కాబట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం బీజేపీ పై ఉండబోదని తెలిపారు.
 

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మోర్బి బ్రిడ్జీ ప్రమాదం కలకలం రేపింది. ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్లో ఈ ప్రమాదం కలవరం కలిగించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రమాద ప్రభావం ఉంటుందా? అనే ఆలోచనల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో బ్రిడ్జీ ప్రమాదం జరిగిన మోర్బి సీటు నుంచే బీజేపీ టికెట్ పై బరిలోకి దిగుతున్న అభ్యర్థి చేస్తున్న వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. మోర్బి నుంచి బీజేపీ టికెట్ పై కాంతిలాల్ అమృతియా బరిలోకి దిగుతున్నారు. ఆయన ముందు ఈ మోర్బి బ్రిడ్జీ ఘటనను ప్రస్తావించగా కీలక వ్యాఖ్యలు చేశారు.

మోర్బి బ్రిడ్జీ విషాదం బాధాకరమని, ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉన్నదని ఆయన అన్నారు. అయితే, తమ యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగిందని వివరించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కమిటీలే ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నదని, త్వరలోనే నిర్ణయం వస్తుందని అన్నారు.

Also Read: గుజరాత్ బ్రిడ్జీ కూలిపోవడం దైవేచ్ఛనే.. : కోర్టులో వంతెన మెయింటెనెన్స్ కంపెనీ మేనేజర్.. డీఎస్పీ ఏమన్నారంటే?

ఈ ఘటనతో ప్రజల్లో వ్యతిరేకత రాలేదా? అని ప్రశ్నించగా.. మోర్బిలో మొత్తం ఐదు స్థానాలు ఉన్నాయని, ఈ ఐదు స్థానాల్లో తామే గెలుస్తామని ఆయన అన్నారు. ఎందుకంటే.. ఇక్కడి ప్రజల హృదయాల్లో బీజేపీ ఉన్నదని వివరించారు. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత లేదని ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు.

ప్రజల అభివృద్ధి కోసం తాము ఫుల్ టైమ్ వర్క్ చేశామని, కాబట్టి తాను గెలుస్తాననే నమ్మకం ఉన్నదని వివరించారు. అంతేకాదు, ప్రజల కోసం తాము ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడమని తెలిపారు. తాను స్వయంగా ప్రజల కోసం పని చేశానని అన్నారు. ఈ ఒక్క సీటు కోసమే కాదు.. జిల్లా మొత్తం తాము పని చేశామని వివరించారు. 1979లో మచ్చు నదిలో డ్యామ్ కూలినప్పుడు సుమారు నాలుగు వేల మంది ప్రజలు మరణించారని, అప్పుడు ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా తాను ఇక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు. అప్పుడు తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కలిసి పని చేశానని, తామిద్దరం అప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా పని చేశామని పేర్కొన్నారు.

click me!