
మహారాష్ట్ర : షర్ట్ కాలర్ మీదున్న టైలరింగ్ ట్యాగ్...ఓ మరణించిన వ్యక్తిని గుర్తించేలా చేసింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో గత నెలలో లోకల్ రైలులో ప్రయాణిస్తూ మృతి చెందిన 57 ఏళ్ల వ్యక్తి కుటుంబాన్ని గుర్తించేందుకు అతని షర్ట్ కున్న టైలర్ షాప్ ట్యాగ్ ఉపయోగపడింది. ఈ మేరకు ఒక పోలీసు అధికారి టైలరింగ్ దుకాణం ట్యాగ్ ప్రభుత్వ రైల్వే పోలీసులకు సహాయపడిందని తెలిపారు. .
ఏప్రిల్ 23న ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో లోకల్ రైలు ఎక్కిన ఓ ప్రయాణికుడు.. ప్రయాణంలో హఠాత్తుగా మరణించాడని డోంబివిలి జిఆర్‌పి సీనియర్ ఇన్‌స్పెక్టర్ అర్చన దుసానా తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఆమె తెలిపారు.
చనిపోయిన వ్యక్తి గుర్తింపును నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పోలీసులు అతని చొక్కాపై టైలరింగ్ దుకాణం ట్యాగ్‌ను చూశారు. అది వంగనిలోని ఒక షాపుకు సంబంధించిందిగా గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఆ క్రమంలో విచారణ చేయగా.. మృతుడు మెహబూబ్ నాసిర్ షేక్‌గా గుర్తించామని, అతని కుటుంబాన్ని గుర్తించామని, ఆదివారం అతని అంత్యక్రియలు నిర్వహించామని అధికారి తెలిపారు.