లోక్‌సభ ఉపఎన్నికలో ఆప్‌కు ఎదురుదెబ్బ.. భగవంత్ మాన్ సీటును కోల్పోయిన పార్టీ

By Mahesh KFirst Published Jun 26, 2022, 3:58 PM IST
Highlights

పంజాబ్‌లో ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సీఎం గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు స్థానం సంగ్రూర్‌లో పరాజయం పాలైంది. 7000 ఓట్ల తేడాతో శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రరన్ జిత్ సింగ్ మాన్.. ఆప్ అభ్యర్థి గుర్మెయిల్ సింగ్ పై గెలిచారు. 
 

చండీగడ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం భగవంత్ మాన్ సింగ్ రాజీనామా చేసిన లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆప్ ఓడిపోయింది. సంగ్రూర్ పార్లమెంటరీ స్థానాన్ని శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) గెలుచుకుంది. శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రన్‌జిత్ సింగ్ మాన్‌పై చేతిలో ఆప్ అభ్యర్థి గుర్మయిల్ సింగ్ సుమారు 7000 ఓట్లతో తేడాతో పరాజయం పాలయ్యాడు. పంజాబ్‌లో భారీ మెజార్టీతో ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ఆప్ ఓడిపోయింది.

శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ (ఈ పార్టీ శిరోమణి అకాలీ దళ్ కాదు) మాజీ ఎంపీ. ఆ పార్టీకి అధ్యక్షుడు కూడా. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ బరిలో సిమ్రన్ జిత్ సింగ్ మాన్ పై చేయి సాధించాడు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి భగవంత్ సింగ్ మాన్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ స్థానం సంగ్రూర్‌కు రాజీనామా చేశాడు. సంగ్రూర్ రీజియన్ ఆప్‌కు కంచుకోట వంటిది. ఈ పార్లమెంటరీ స్థానంలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుచుకుంది. భగవంత్ మాన్ ఈ పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు గెలిచాడు. 2014, 2019లలో ఈ స్థానాల్లో లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందాడు.

తాజాగా, ఈ సంగ్రూర్ పార్లమెంటు స్థానంలో ఆప్ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజా ఉప ఎన్నికలో ఆప్ సంగ్రూర్ జిల్లా ఇంచార్జీనే అభ్యర్థిగా భగవంత్ మాన్ పార్టీ బరిలోకి దించింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్.. ఈ సంగ్రూర్ పార్లమెంటు ఉప ఎన్నికలో గెలిచి తన ఆధిక్యతను కొనసాగించాలని, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్ పార్టీలు కూడా తమ ఉనికి చాటడానికి ఈ ఎన్నికలో చాలా యాక్టివ్‌గా పాల్గొన్నాయి. కానీ, ఇవేవీ గెలుచుకోకుండా శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) అధ్యక్షుడు సిమ్రన్ జిత్ గెలుపొందాడు. కాగా, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దిల్విర్ సింగ్ గోల్డీ, నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి కేవల్ ధిల్లాన్, ఐదో స్థానంలో శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి కమల్‌దీప్ కౌర్ రాజోనా‌లు ఉన్నారు.

click me!