
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి మమతా బెనర్జీ(Mamata Banerjee) సర్కారుకు షాక్ తగిలింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో రూపొందించిన స్పైవేర్ పెగాసెస్ (Pegasus) పై దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్ సారథ్యంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. తాజాగా, సుప్రీంకోర్టు ఈ కమిషన్ పెగాసెస్ స్పైవేర్‌పై దర్యాప్తు చేయడాన్ని తప్పుబట్టింది. తమకు ముందుగా ఇచ్చిన హామీకి భిన్నంగా నడుచుకోవడంపై ఆగ్రహించింది. వెంటనే ఆ కమిషన్ దర్యాప్తుపై స్టే విధించింది.
పెగాసెస్ స్పైవేర్ ఉదంతం దేశ రాజకీయాలను కుదిపేసింది. ఈ స్పైవేర్ దేశ రాజకీయాల్లో కనీసం మూడు సార్లు తీవ్రంగా చర్చకు వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ స్పైవేర్ పేరు మారుమోగింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌వో పెగాసెస్ స్పైవేర్‌ను రూపొందించింది. అయితే, ఈ స్పై వేర్‌ను తాము ప్రైవేటు సంస్థలకు విక్రయించబోమని, కేవలం ప్రభుత్వ సంస్థలకు మాత్రమే విక్రయిస్తామని ఎన్‌ఎస్‌వో వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఈ స్పైవేర్‌తో మన దేశానికి చెందిన ప్రముఖులపై నిఘా వేస్తున్నారని అంతర్జాతీయంగా పరిశోధనాత్మక వ్యాసాలు వెలువడ్డాయి. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, ప్రత్యర్థులు, పాత్రికేయులు ఇలా ఎంతో మందిపై ఈ పెగాసెస్ నిఘా ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వమే వ్యక్తిగత గోప్యత హక్కును హరించి పౌరులపై నిఘా వేస్తున్నదని తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు ఈ పంచాయతీ సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.
Also Read: పెగాసస్.. ఎన్ఎస్ వో నిషేధంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఎన్‌జీవో గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ పెగాసెస్‌పై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సారథ్యంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం విచారిస్తున్నది. పెగాసెస్ అంశంపై దర్యాప్తు చేయడానికి ఈ ధర్మాసనం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా పెగాసెస్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంబీ లోకూర్ సారథ్యంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు మండిపడింది. ఈ కమిషన్ దర్యాప్తుపై స్టే విధించింది.
Also Read: పెగాసస్ స్పైవేర్ : సుప్రీం కోర్టుకు సమాధానం చెప్పలేని కేంద్రం.. ఈ స్పైవేర్ ఏంటి, విచారణ ఎందుకు ?
పశ్చిమ బెంగాల్ తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ఏఎం సింఘ్వీని సీజేఐ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు. ‘ఏంటిదీ? చివరి సారే మీరు మాకు మాట ఇచ్చారు. పెగాసెస్‌పై ఎలాంటి దర్యాప్తు చేపట్టబోమని చెప్పారు కదా. కానీ, మళ్లీ మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు’ అంటూ అడిగారు. దీనిపై సింఘ్వీ సమాధానం చెబుతూ, తాను కమిషన్ తరఫున వాదించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్నామని అన్నారు. అయితే, కోర్టు ఆదేశాలను ఆ కమిషన్‌కు తెలిపామని చెప్పారు. పెగాసెస్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఆ కమిషన్ దర్యాప్తు చేయబోదని అన్నారు. ఆ తీర్పు తర్వాతే మాజీ జస్టిస్ ఎంబీ లోకూర్ సారథ్యంలోని కమిషన్ దర్యాప్తు జరుపుతుందని వివరించారు.
పెగాసస్ స్పైవేర్ (Pegasus Spyware) ను తయారు చేసిన ఎన్ఎస్‌వో గ్రూప్‌పై పలు దేశాలు నిషేధం విధించాయి.