కోవిషీల్డ్‌తో గందరగోళం.. భారతీయ విద్యార్ధులకు బాసటగా సీరమ్ అధినేత, రూ.10 కోట్ల సాయం

By Siva KodatiFirst Published Aug 5, 2021, 7:57 PM IST
Highlights

కొన్ని దేశాలు మాత్రం తాము ఆమోదించిన జాబితాలో కొవిషీల్డ్‌ను చేర్చకపోవడంతో భారతీయ విద్యార్థులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఆర్థిక సాయం చేయాలని సీరమ్ అధినేత అదర్ పూనావాలా నిర్ణయించారు.

దేశంలోని ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా తన పెద్ద మనసు చాటుకున్నారు. విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం దేశంలో కరోనా టీకా కార్యక్రమం కింద దీన్ని అర్హులందరికీ అందిస్తున్నారు. వారిలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఉన్నారు. రెండు డోసుల టీకా తీసుకుంటే ఎటువంటి క్వారంటైన్‌ నిబంధనలు లేకుండా విద్యార్థులు వచ్చేందుకు విదేశాలు అనుమతిస్తున్నాయి.   

అయితే కొన్ని దేశాలు మాత్రం తాము ఆమోదించిన జాబితాలో కొవిషీల్డ్‌ను చేర్చకపోవడంతో భారతీయ విద్యార్థులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఆర్థిక సాయం చేయాలని అదర్ పూనావాలా ముందుకొచ్చారు. ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించారు. కొన్ని దేశాలు కొవిషీల్డ్‌ను ప్రయాణానికి ఆమోదయోగ్యమైన టీకాగా తమ జాబితాలో చేర్చనందున క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దాంతో మీరు కొంత ఖర్చులు భరించాల్సి రావొచ్చు. అందుకోసమే తాను రూ.10 కోట్లు కేటాయించానని పూనావాలా ట్వీట్ చేశారు. ఆర్థిక సహాయం అవసరమైన వారు సంప్రదించాల్సిన లింక్‌ను ఆయన షేర్ చేశారు. మరోవైపు కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు ఎటువంటి నిబంధనలు లేకుండా తమ దేశంలోకి ప్రవేశించేందుకు 16 ఐరోపా దేశాలు అనుమతించడంపై గతంలో పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. 

click me!