తాలిబన్లు.. భారత స్వాతంత్య్ర సమరయోధుల వంటి వారేనట: సమాజ్‌వాదీ ఎంపీపై దేశద్రోహం కేసు

By Siva KodatiFirst Published Aug 18, 2021, 2:50 PM IST
Highlights

తాలిబ‌న్ల‌ను భార‌త స్వాతంత్య్ర‌ సమర యోధులతో పోల్చిన ఆరోప‌ణ‌ల‌పై ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎంపీ స‌హా ముగ్గురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అమెరికా, ర‌ష్యా త‌మ దేశం విష‌యంలో జోక్యం చేసుకోకుండా ఆఫ్ఘ‌న్‌లోని తాలిబ‌న్లు నిరోధించార‌ని  సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్ వ్యాఖ్యానించారు. 
 

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఎన్నో దాడుల‌కు పాల్ప‌డి వేలాది మంది ప్రాణాలు తీసి చివ‌ర‌కు ఆ దేశంలో పాలనను హస్తగతం చేసుకున్న తాలిబ‌న్ల‌ను భార‌త స్వాతంత్య్ర‌ సమర యోధులతో పోల్చిన ఆరోప‌ణ‌ల‌పై ఓ ఎంపీ స‌హా ముగ్గురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. తాలిబ‌న్లు చేసిన పోరాటాన్ని భార‌త స్వాతంత్య్ర సంగ్రామంతో పోల్చుతూ ఇటీవ‌ల సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్ వ్యాఖ్య‌ానించిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

అమెరికా, ర‌ష్యా త‌మ దేశం విష‌యంలో జోక్యం చేసుకోకుండా ఆఫ్ఘ‌న్‌లోని తాలిబ‌న్లు నిరోధించార‌ని రహ్మన్ ప్రశంసించారు. ఆఫ్ఘ‌న్‌ స్వేచ్ఛగా వుండాలని, తాలిబ‌న్లు దేశాన్ని పాలించాలని తాను కోరుకుంటున్నానని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే, మ‌రో ఇద్ద‌రు కూడా తాలిబ‌న్ల‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేశారు. అయితే అహింసా మార్గంలో శాంతియుతంగా జరిగిన భార‌త స్వాతంత్య్ర సంగ్రామంతో తాలిబన్ల చ‌ర్య‌ల‌ను పోల్చ‌డ‌ంపై ప‌లువురు భగ్గుమన్నారు. వారిపై ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఎంపీ సహా ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదు చేశామ‌ని చంబల్ జిల్లా పోలీసులు తెలిపారు. 

Also Read:తాలిబన్లకు షాక్: చారికర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్న ఆఫ్ఘన్ సైన్యం

భారత స‌ర్కారు ప్రకారం తాలిబన్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఎస్పీ చెప్పారు. తాలిబన్లపై చేసిన ఇటువంటి వ్యాఖ్యలు రాజద్రోహంగా పరిగణించవచ్చని తెలిపారు. ఈ కార‌ణంగానే తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామ‌ని చెప్పారు. మరోపక్క, స‌మాజ్ వాదీ పార్టీ నేత చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలలానే షఫీఖర్ బార్క్ మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు

click me!