భార్య మరణం కేసు తీర్పుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కామెంట్

By telugu teamFirst Published Aug 18, 2021, 2:11 PM IST
Highlights

కాంగ్రెస్ ఎంపీ శశిథరరూర్ తన భార్య సునంద పుష్కర్ అనుమానస్పద మరణంపై ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించారు. ప్రస్తుత న్యాయవ్యవస్థలో చాలా సార్లు విచారణే శిక్షగా మారుతుందన్నారు. తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. భార్య మరణం నుంచి ఏడేళ్లుగా నరకయాతన అనుభవించినట్టు చెప్పారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన భార్య సునంద పుష్కర్ మరణంపై ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించారు. ప్రస్తుత న్యాయవ్యవస్థలో విచారణే చాలా సార్లు శిక్షగా మారుతుందని అన్నారు. ఈ తీర్పు వెలువరించినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఏడున్నరేళ్లుగా నరకయాతన అనుభవించినట్టు ఆవేదన వ్యక్తపరిచారు.

తన భార్య విషాదాంతం తననూ ఒక పీడకలలా వెంటాడిందని ఎంపీ శశిథరూరర్ అన్నారు. తనపై అనేక ఆరోపణలు వచ్చాయని, మీడియా కూడా అర్థరహిత ఆరోపణలు చేసిందని వ్యాఖ్యానించారు. కానీ, న్యాయవ్యవస్థపై తాను నమ్మకం కోల్పోలేదని, దానికి ప్రతిఫలం ఈ రోజు అందిందని వివరించారు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నివాసానికి మరమ్మతులు చేయిస్తుండగా వారు ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో తాత్కాలిక నివాసానికి మారారు. అదే సమయంలో అంటే 2014లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మరణంపై శశిథరూర్‌ను నిందితుడిగా ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. సునంద పుష్కర్‌ను హింసించారని, ఆమె ఆత్మహత్యకు పురికొల్పాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. తొలుత సునంద పుష్కర్‌పై విషప్రయోగం జరిగిందని పోలీసులు ఆరోపించారు. అనంతరం, నిందితుల పేర్లేవీ పేర్కొనకుండా మర్డర్ కేసు నమోదు చేశారు.

తనపై ఆరోపణలను శశిథరూర్ ముందు నుంచి కొట్టిపారేస్తూ వచ్చారు. సునంద పుష్కర్ మరణం హత్యా? ఆత్మహ్యతా? అనేదే ఇంకా నిర్ధారణ కాలేదని వివరించారు. సునంద పుష్కర్ ఆరోగ్య సమస్యల కోసం పలువిధాల చికిత్స తీసుకుంటున్న సమయంలో  మరణించారని, ఆమె మరణాన్ని ఒక యాక్సిడెంట్‌గా పరిగణించాలని వాదించారు. తన క్లయింట్‌పై ఒక్కరు కూడా వరకట్నం కోసం వేధించినట్టు ఆరోపణలు చేయలేదని, ఆమెపట్ల క్రూరంగా వ్యవహరించారనీ ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పలేదని న్యాయవాది వికాస్ పహ్వా అన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా అతనని నిర్దోషిగానే ప్రకటించిందని తెలిపారు.

కొన్నేళ్ల దర్యాప్తు తర్వాత కూడా సునంద పుష్కర్ మరణానికి గల కారణాలను ధ్రువీకరించడంలో పోలీసులు విఫలమయ్యారని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఈ కేసు నుంచి శశిథరూర్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కశ్మీర్‌లో జన్మించిన సునంద పుష్కర్‌ను 2010లో వివాహమాడారు. 2014లో ఆమె మరణించారు. ఆమె మరణానికి ముందు చేసిన ట్వీట్ కలకలం రేపింది. దంపతుల మధ్య ఘర్షణలున్నట్టు సంకేతాలనిచ్చింది. శశిథరూర్ ఓ పాకిస్తానీ జర్నలిస్టుతో సన్నిహితంగా మెలుగుతున్నారని హింట్ ఇచ్చింది. ఈ తరుణంలోనే శశిథరూర్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థులకు సునంద పుష్కర్ అనుమానాస్పద మరణం ఒక ఆయుధంగా పనికివచ్చింది.

click me!