security breach in Lok Sabha: బుధవారం మధ్యాహ్నం 1.02 గంటలకు పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని పసుపు రంగులో గ్యాస్ ను వెదజల్లుతున్న పొగ డబ్బాలతో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి లోక్ సభ ఛాంబర్ లోకి దూసుకెళ్లడంతో భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది.
security breach in parliament: పార్లమెంట్ లో భారీ భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. లోక్ సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలు చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు స్పీకర్ వెల్ లోకి దూకడంతో పాటు ఒక రకమైన గ్యాస్ ను విడుదల చేయడం కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు టియర్ గ్యాస్ క్యానిస్టర్‌లను పట్టుకుని పబ్లిక్ గ్యాలరీ నుండి సభలోకి దూకడంతో లోక్‌సభలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరూ హౌస్‌లోకి ప్రవేశించిన వెంటనే, వారిలో ఒకరు బెంచీల మీదుగా దూకడం కనిపించింది. మరొకరు ఒక రకమైన టియర్ గ్యాస్ పదార్థాన్ని స్ప్రే చేయడం కనిపించింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరిని అక్కడ సెక్యూరిటీ పట్టుకుంది. ఆ ఇద్దరు దుండగులను సాగర్ శర్మ, మనోరంజన్ డి గా గుర్తించారు. అధికారులు వారి వివరాలు వెల్లడిస్తూ.. నిందితులు మైసూర్-కొడగు ఎంపీ ప్రతాప్ సింహ ద్వారా పార్లమెంట్ లోకి ప్రవేశించడానికి పాస్ లు పొందారని సమాచారం. నిందితులను శంకర్ లాల్ శర్మ కుమారుడు సాగర్ శర్మ, డి దేవరాజ్ కుమారుడు డి మనోరంజన్ (35)గా గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వెలుపల అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరిని నీలం అనే 42 ఏళ్ల మహిళ, 25 ఏండ్ల అమోల్ షిండేగా గుర్తించారు. దుండగుల గురించి పోలీసు వర్గాలు పరిమిత సమాచారాన్ని విడుదల చేశాయి. అయితే, మనోరంజన్ మైసూరుకు చెందినవాడనీ, మైసూర్ వివేకనంద యూనివర్సీటి లో కంప్యూటర్ సైన్సెస్ లో గ్రాడ్యుయేట్ అని సమాచారం.
పార్లమెంటు వెలుపల అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు హర్యానాలోని హిసార్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ నలుగురిని అరెస్టు చేశామనీ, ఢిల్లీ పోలీసుల యాంటీ టెర్రర్ సెల్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తోందన్నారు. పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సహా ఉన్నతాధికారులు పార్లమెంటులో ఉన్నారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.