జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. శివలింగం పరిరక్షణ ఉత్తర్వులను పొడిగించిన సుప్రీం కోర్టు..

By Sumanth KanukulaFirst Published Nov 11, 2022, 4:49 PM IST
Highlights

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన శివలింగం పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రక్షణను పొడిగిస్తున్నట్టుగా సుప్రీం కోర్టు తెలిపింది.

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన శివలింగం పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రక్షణను పొడిగిస్తున్నట్టుగా సుప్రీం కోర్టు తెలిపింది. హిందూ పార్టీల తరపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్.. 'శివలింగాన్ని' రక్షించే మధ్యంతర ఉత్తర్వును పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. మధ్యంతర ఉత్తర్వుల గడువు నవంబర్ 12తో ముగుస్తుందని పేర్కొన్న ఆయన.. దానిని పొడిగించాలని కోరారు. ముస్లిం పార్టీలు దాఖలు చేసిన ఆర్డర్ 7 రూల్ 11 (ఫిర్యాదుదారుల తిరస్కరణ) దరఖాస్తును తిరస్కరించినట్లు కూడా ఆయన ప్రస్తావించారు. 

ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించేందుకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం గురువారం వెల్లడించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సుప్రీం కోర్టు.. శివలింగం పరిరక్షణ కోసం గతంలో ఇచ్చిన ఆదేశాలను పొడిగిస్తున్నట్టుగా పేర్కొంది.

ఈ ఏడాది మే నెలలో  జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం ఉన్నట్లు తెలిపిన ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటర్ ఫౌంటెన్ పునాదిని శివలింగంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ముస్లిం పక్షం ఆరోపిస్తుంది. 

ఇక, ఇదే కేసుకు సంబంధించిన మరో అంశం పాస్ట్ ట్రాక్ కోర్టు విచారణలో ఉంది. శివలింగాన్ని పూజించేందకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును కోర్టు నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. 

click me!