విదేశాల్లో జెండా పీకేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!

First Published Jun 29, 2018, 11:06 AM IST
Highlights

భారతదేశంలో కెల్లా అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇకపై  కొన్ని దేశాల్లో తమ వ్యాపారాన్ని నిలిపివేయాలని చూస్తోంది.

భారతదేశంలో కెల్లా అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇకపై  కొన్ని దేశాల్లో తమ వ్యాపారాన్ని నిలిపివేయాలని చూస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల్లోని ఆరు శాఖలను మూసివేసిన ఎస్‌బిఐ తాజాగా మరో తొమ్మిది శాఖలను మూసివేయాలని ప్లాన్ చేస్తోంది.

విదేశీ వ్యాపార కార్యకలాపాల హేతుబద్దీకరణలో భాగంగా కొన్ని శాఖలను మూసివేస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌) ప్రవీణ్‌ కె గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఎస్‌బిఐ 36 దేశాల్లో దాదాపు 190 శాఖలను నిర్వహిస్తోంది. అనేక బ్యాంకు శాఖల్లో మూలధనం ప్రధాన అవరోధంగా మారడం, ఉపయోగకరంగా ఉన్న ప్రాంతాల్లో మూలధనాన్ని వినియోగించాలనుకుంటున్న నేపథ్యంలో విదేశీ శాఖల హేతుబద్దీకరణ చేపట్టామని ఆయన అన్నారు.

ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పటికే ఆరు శాఖలు మూసివేశామని, మరో తొమ్మిది శాఖలను మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రవీణ్ చెప్పారు. బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో చిన్న శాఖలు, రిటైల్‌ శాఖలు ఉన్నాయని, వీటిని హేతుబద్దీకరణ చేయాల్సిన అవసరం ఉందని, విదేశాల్లోని అన్ని శాఖలు కూడా పూర్తిస్థాయి కార్యాలయాలు కావని అన్నారు.

వ్యాపారం సరిగ్గా జరగని ప్రాంతాల్లో శాఖల మూసివేతకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక సర్వీసుల శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో శాఖల మూసివేత తప్పడం లేదని, శాఖల హేతుబద్దీకరణ నిరంతరంగా జరిగే ప్రక్రియేని, అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత ఏడాది కాలంలో 1,800 శాఖలను హేతుబద్దీకరణ చేశామని ప్రవీణ్ అన్నారు. ఇలాంటి శాఖలను మూసివేయటం వలన లాభమే కానీ నష్టమేమీ లేదని, దాదాపు 250 కార్యాలయాలను మూసివేయడం వల్ల సంస్థకు చాలా ఆదా అవుతోందని చెప్పారు.

click me!