అమ్మో! ఇండియా వస్తే కొట్టి చంపేస్తారు

First Published 28, Jun 2018, 9:16 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చోక్సీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చోక్సీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను తిరిగి భారత్ వస్తే కొట్టి చంపుతారని అన్నాడు. అందువల్ల తనపై జారీ చేసిన నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలని ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టును కోరాడు.

 గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ అయిన మెహుల్ చోక్సీ పీఎన్‌బీ కుంభకోణంలో కీలక నిందితుడు. చోక్సీ తరపు న్యాయవాది సంజయ్ అబాట్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జేసీ జగ్దాలేకు చోక్సీ పెట్టుకున్న పిటిషన్‌ను అందించారు.

తాను భారత్ రాలేనని, తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటిషన్‌లో చోక్సీ అన్నాడు. తన ఆరోగ్యం కూడా ప్రయాణానికి సహకరించడం లేదని తెలిపాడు. వివిధ వ్యక్తుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉండడంతో తన ఆచూకీ చెప్పలేనని అన్నాడు.
 
దర్యాప్తు నుంచి తప్పించుకోవాలని తానెప్పుడూ అనుకోలేదని, దర్యాప్తు సంస్థలకు తాను అన్ని రకాలుగా సహకరిస్తున్నానని చెప్పారు. ఆయా సంస్థల నుంచి తనకు అందించిన నోటీసులన్నింటికీ సమాధానం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. నీరవ్ మోడీ కేసుకు, తన కేసుకు సంబంధం లేదని చెప్పారు.

Last Updated 28, Jun 2018, 9:16 PM IST