ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో పోటీ... బలం నిరూపించుకునేందుకా..? ఓటమి భయంతోనా..?

By Galam Venkata Rao  |  First Published Jun 18, 2024, 2:09 PM IST

2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేశారు. రాయ్ బరేలి, వయనాడ్ నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. వయనాడ్ ను వదిలేసి రాయ్ బరేలికి ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించారు రాహుల్. 


ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండుచోట్ల ఘన విజయం సాధించారు. ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రంలోని  రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్‌ పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి.. భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, రాహుల్‌ రెండింటిలో ఒక్కచోటే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దీంతో వయనాడ్‌ను రాహుల్‌ వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో జరగబోయే ఉప ఎన్నికలో రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. 

ఇలా రెండు, మూడు చోట్ల పోటీ చేసిన నాయకులు చరిత్రలో అనేక మంది ఉన్నారు. ప్రముఖ నాయకులు చాలా మంది ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేశారు. కొందరు పోటీచేసిన రెండు స్థానాల్లో గెలిస్తే... మరికొందరు ఒకచోట గెలిచి, మరోచోట ఓటమి పాలయ్యారు. అయితే ఎన్ని స్థానాల్లో గెలిచినా ప్రాతినిధ్యం మాత్రం ఒక్క నియోజకవర్గ నుంచి వహించాల్సి ఉంటుంది. 

Latest Videos

ఇదే మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు నాయకులు రెండు చోట్ల పోటీ చేశారు. వారేం సాధించారు..? ఎక్కడెక్కడి నుంచి పోటీ చేసి.. చివరికి ఏ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారంటే...

గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల అగ్రనాయకులు రెండేసి స్థానాల నుంచి పోటీ చేశారు. మాజీ సీఎం, భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రెండు చోట్ల పోటీ చేశారు. కేసీఆర్‌ తన సిట్టింగ్‌ స్థానం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు. అయితే, గజ్వేల్‌లో గెలిచిన కేసీఆర్‌... కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిపై ఓడిపోయారు. 
ఇక, రేవంత్‌ రెడ్డి కూడా కామారెడ్డితో పాటు కొడంగల్‌ నియెజకవర్గం నుంచి పోటీ చేశారు. కామారెడ్డి ఓడిపోగా.. గతంలో ఓటమిపాలైన కొడంగల్‌ నుంచి ఈసారి విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. 
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన సిటింగ్ స్థానం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ పోటీ చేసి... రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు ఈటల రాజేందర్. 

కేసీఆర్ 2014 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి రెండుచోట్లా గెలిచారు. గజ్వేల్‌కు ప్రాతినిధ్యం వహించి.. ముఖ్యమంత్రి అయ్యారు. 

ఇక, దివంగత పీవీ నరసింహారావు, ఎన్‌టీఆర్‌తో పాటు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండుచోట్ల పోటీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి.. రెండుచోట్లా ఓడిపోయారు. 

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారు. 2009 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు, తిరుపతి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన చిరంజీవి... తిరుపతిలో గెలిచారు. పాలకొల్లులో ఓడిపోయారు. 

దివంగత మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) ఏకంగా మూడు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోస్తాంధ్రలోని గుడివాడ, రాయలసీమలోని హిందూపురం, తెలంగాణలోని నల్గొండ స్థానాల నుంచి బరిలోకి దిగారు. మూడు స్థానాల్లోనూ విజయం సాధించిన ఎన్టీఆర్‌... నల్గొండ, గుడివాడ స్థానాలను వదులుకున్నారు. హిందూపురానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం, మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పోటీ చేసిన ఎన్టీఆర్‌... కల్వకుర్తిలో ఓటమి చవిచూశారు.  

ఇక మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా రెండు చోట్ల పోటీ చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా నుంచి కూడా పోటీ చేయడం చరిత్ర. 1991లో ప్రధాన మంత్రిగా ఎన్నికైన పీవీ నరసింహారావు.. అప్పటికి ఎంపీగా ఎన్నిక కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో గెలిచిన గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించింది. అక్కడ ఉప ఎన్నికలో పీవీ నరసింహారావును బరిలో ఆయన గెలిచారు. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన పీవీ... రెండు చోట్లా గెలిచారు. నంద్యాల విడిచిపెట్టిన పీవీ బరంపురానికి ప్రాతినిధ్యం వహించారు.

వీరే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ, అటల్‌ బిహారీ వాజపేయీ, ఎల్‌కే అద్వాణీ, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, ములాయం సింగ్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, మాజీ సీఎం కుమారస్వామి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కమ్యూనిస్ట్‌ నేత రావి నారాయణరెడ్డిలాంటి వారు చాలా మంది రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, అద్వాణీ, ఇందిరా గాంధీ, ములాయం సింగ్‌ యాదవ్‌ పోటీ చేసిన రెండుచోట్లా గెలిస్తే... లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒకచోట గెలిచి మరోచోట ఓడిపోయారు. వాజపేయీ మూడుచోట్ల పోటీ చేసి ఒక స్థానంలోనే గెలిచారు. మరో కమ్యూనిస్ట్‌ నేత పెండ్యాల రాఘవరావు కూడా ఎన్‌టీఆర్‌ లాగే చరిత్ర సృష్టించారు. ఏకంగా మూడు స్థానాల్లో పోటీ చేసి మూడుచోట్లా గెలిచారు. ఇలా ఎన్నిచోట్ల పోటీ చేసినా.. ఎన్ని స్థానాల్లో గెలిచినా ప్రాతినిధ్యం మాత్రం ఒక నియోజకవర్గానికి వహించాల్సి ఉంటుంది.

ఇలా రెండు మూడు చోట్ల పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు.. ఒకే నియోజకవర్గానికి ప్రతినిధ్యం వహించి, మిగతా స్థానాలను వదులుకుంటారు. ఇలా వదులుకున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహిచాల్సి ఉంటుంది. ఇది ఎన్నికల సిబ్బందికి భారం కావడంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని కూడా. దీంతో ఒకే అభ్యర్థి రెండుచోట్ల పోటీ చేయడంపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓటమి భయంతోనే ఇలా వేర్వేరు చోట్ల పోటీ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. 

ఇలా రెండు మూడు నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థి పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ... సుప్రీం కోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై న్యాయస్థానం మాత్రం ఎలాంటి ఆదేశాలివ్వలేదు. ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. 

 

click me!