శబరిమలలో గడిచిన ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. రద్దీని అంచనా వేయడంలో, నిర్వహణ, ఏర్పాట్ల విషయంలో తప్పుగా నిర్వహించడంపై ప్రతిపక్షాలు కేరళ ప్రభుత్వంపై నిందలు వేస్తూనే ఉన్నాయి.
శబరిమలలో గడిచిన ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. రద్దీని అంచనా వేయడంలో, నిర్వహణ, ఏర్పాట్ల విషయంలో తప్పుగా నిర్వహించడంపై ప్రతిపక్షాలు కేరళ ప్రభుత్వంపై నిందలు వేస్తూనే ఉన్నాయి. విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది యాత్రికులు అయ్యప్ప దర్శనం పొందకుండానే పందళం నుండి తిరిగి వెళ్లిపోతున్నారు. మరోవైపు శబరిమలలో దారి తప్పి ఓ చిన్నారి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిలక్కల్ వద్ద గుంపులో గల్లంతైన తన తండ్రి కోసం పిల్లవాడు వెతుకుతున్నట్లు ఫుటేజీ చూపిస్తుంది. సాయం కావాలని చేతులు చాస్తూ పోలీసుల ముందు అరుస్తున్న చిన్నారి.. చివరకు తండ్రిని చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టాడు.
ఇదిలా ఉండగా శబరిమల సీజన్‌లో యాత్రికుల రద్దీ పెరిగే దృష్ట్యా మరింత సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. యాత్రికులకు ఇబ్బంది కలగని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవస్వం మంత్రి కె. రాధాకృష్ణన్, అటవీ శాఖ మంత్రి ఎ.కె.శశీంద్రన్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ వి.వేణు, దేవస్వోమ్ బోర్డు అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్, రాష్ట్ర పోలీసు చీఫ్ షేక్ దర్వేష్ సాహిబ్, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
గంటల తరబడి నిరీక్షిస్తూ కొండ ఎక్కేందుకు వీలు లేకపోవడంతో వేలాది మంది భక్తులు వెనుదిరిగారు. అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు గంటల తరబడి నిలిచిపోవడంతో చాలా మంది పది గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. పంపా నుండి ప్రతి పది నిమిషాలకు KSRTC బస్సులు రాకపోకలు సాగిస్తాయి. అటవీ మార్గంలో చాలా వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ప్లాపల్లి ఇలవుంకల్ మార్గంతోపాటు అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయిన యాత్రికులకు నీరు, ఆహారం దొరకడం లేదు. రద్దీ, ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ అయ్యప్ప దర్శనాల కోసం ఈరోజు 89,981 మంది బుక్ చేసుకున్నారు.
కాగా.. శబరిమల ఆలయం వద్ద భారీ రద్దీ కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ఉన్నత స్థాయి మంత్రుల బృందాన్ని పంబాకు పంపాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. మంత్రులు పంబకు వెళ్లి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలన్నారు. రద్దీని నియంత్రించడంతో పాటు భక్తులకు మౌళిక సదుపాయాలు కల్పించడానికి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సూచించారు. ప్రభుత్వం, ఆలయాన్ని పాలిస్తున్న ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైతే ఆందోళన చేపడతామని బీజేపీ హెచ్చరించింది.
అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి పోలీసులు, అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తుంటారనీ, గరిష్ఠంగా 80 వేల మందికి మాత్రమే వసతి కల్పిస్తున్నామన్నారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతున్నారు. యాత్రికులను వెంబడించి పట్టుకోలేమనీ, కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దనీ, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికార యంత్రాంగానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది.