ఎస్. జైశంకర్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

By Rajesh Karampoori  |  First Published Mar 9, 2024, 12:10 AM IST

S.Jaishankar Biography: కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో  విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన దౌత్యసంబంధాలను మెరుగుపరచడంలో పరమ చాణిక్యుడు. దేశ ప్రజలు ఆయన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఆయనపై ప్రధాని మోడీకి పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇలా బ్యూరోక్రాట్‌ నుంచి రాజకీయవేత్తగా మారిన  క్యాబినెట్ మంత్రి ఎస్ జైశంకర్ జీవిత, రాజకీయ ప్రస్థానం మీకోసం..


S.Jaishankar Biography: 

బాల్యం, కుటుంబం

Latest Videos

ఎస్ జైశంకర్ పూర్తి పేరు సుబ్రమణ్యం జైశంకర్. ఆయన  జనవరి 9, 1955న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించారు. ఆయన తండ్రి పేరు కె సుబ్రమణ్యం , తల్లి పేరు సులోచన దేవీ. వాస్తవానికి  జైశంకర్  తమిళ కుటుంబం నుండి వచ్చారు. ఎస్ జైశంకర్‌కి హిందీ, ఇంగ్లీషు మాత్రమే కాకుండా తమిళం, రష్యన్, జపనీస్ భాషలు కూడా తెలుసు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తండ్రి కృష్ణస్వామి సుబ్రమణ్యం ISS అధికారి. ఆయన భారతదేశపు అత్యంత ప్రముఖ జాతీయ భద్రతా వ్యూహకర్తలలో ఒకరు. కార్గిల్ యుద్ధం తర్వాత సమీక్షతో సహా అనేక భారత ప్రభుత్వ కమిటీలు, విచారణ కమిషన్‌లకు ఆయన నాయకత్వం వహించారు. 

జైశంకర్ తండ్రి కె సుబ్రమణ్యం 1999లో పద్మభూషణ్‌ను స్వీకరించేందుకు నిరాకరించారు. బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు ప్రభుత్వ అవార్డులు తీసుకోవద్దని అంటారు. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో సుబ్రమణ్యం జాతీయ భద్రతా మండలి సలహా బోర్డు కన్వీనర్‌గా నియమితులయ్యారు. అదే బోర్డు అణు సిద్ధాంతం ముసాయిదాను సిద్ధం చేసింది, అందులో ముఖ్యమైన అంశం 'నో ఫస్ట్ యూజ్'. విదేశాంగ మంత్రి జైశంకర్ తండ్రి కె సుబ్రమణ్యం ఫిబ్రవరి 2, 2011న మరణించారు. ఎస్ జైశంకర్‌కు ఇద్దరు సోదరులు ఉన్నారు. సంజయ్ సుబ్రహ్మణ్యం, ఎస్ విజయ్ కుమార్. ఇందులో సంజయ్ సుబ్రమణ్యం ఒక చరిత్రకారుడు కాగా, S విజయ్ కుమార్ భారతదేశ మాజీ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి. తల్లి సులోచన దేవి సంగీతంలో పీహెచ్‌డీ.

విద్యాభ్యాసం

ఎస్ జైశంకర్ ప్రాథమిక విద్యాభ్యాసం న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ స్కూల్‌లో జరిగింది. తర్వాత న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ చేశారు. ఆ తర్వాత 1977లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఫిల్ చేసి 1981లో పీహెచ్‌డీ చేశారు. తర్వాత సివిల్ సర్వీస్‌లో చేరారు.

వైవాహిక జీవితం

ఇక జైశంకర్ వైవాహిక జీవిత విషయానికి వస్తే.. మొదటి భార్య శోభ క్యాన్సర్‌తో మరణించారు. ఆమె మరణం తర్వాత జైశంకర్ జపాన్ కు చెందిన క్యోకోను వివాహం చేసుకున్నాడు.  జైశంకర్‌కు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకుల పేర్లు ధృవ్ జైశంకర్, అర్జున్ జైశంకర్ కాగా, కూతురు మేఘా జైశంకర్. ఎస్ జైశంకర్ పెద్ద కుమారుడు ధ్రువ్ అమెరికాలో థింక్ ట్యాంక్‌తో పనిచేస్తున్నాడు. ఆయన అమెరికన్ అమ్మాయి కసాండ్రాను వివాహం చేసుకున్నాడు. కూతురు మేఘ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చిత్ర పరిశ్రమలో పనిచేస్తోంది. ఎస్ జైశంకర్ హిందువు( బ్రాహ్మణుడు).


ప్రారంభ జీవితం.. 
 
ఈనాటి మహానేతలు విద్యార్ధి రాజకీయాలు చేస్తూ తమ రాజకీయాలను మెరుగుపరుచుకున్నారని, ఆ రోజుల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలో భాగస్వామ్యమైపోయారని తరచు వింటుంటాం, కానీ ఎస్. జైశంకర్ విద్యార్థి జీవితం లేదా అతని ప్రారంభ జీవితంలో రాజకీయాల ప్రస్థావ లేదు. విద్యార్థి రాజకీయాలు, ఉద్యమాలు మొదలైన వాటికి ఆయన మొదటి నుంచి చాలా దూరం. అతను తన విద్యార్థి జీవితాన్ని విద్యార్థిగానే గడిపాడు. ఆయన కేవలం 24 సంవత్సరాల వయస్సులో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు. ఎస్ జైశంకర్ తన జీవితకాలంలో అనేక దేశాలకు భారతదేశ రాయబారిగా వ్యవహరించారు. వాటిలో ప్రముఖమైనవి అమెరికా, రష్యా,చైనా. అతని దౌత్య విధానానికి ముగ్దుడైన ప్రధాని మోడీ అతనిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇలా బ్యూరోక్రాట్ నుండి రాజకీయ నాయకుడిగా మార్చారు.

 

 రాజకీయ జీవితం

ఎస్ జైశంకర్ తన కెరీర్ ప్రారంభంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో అధికారిగా ఉన్నారు. కానీ, ఆయన ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. మోడీ ప్రభుత్వం 2019 మేలో ఆయన తన రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ప్రధాని మోడీ మంత్రి వర్గంలో చేరారు. ఇలా ఎస్ జైశంకర్ రాజకీయ ప్రయాణానికి నాంది పలికారు. ఈ సమయంలో ఆయన  17వ లోక్‌సభలో విదేశాంగ మంత్రిగా ఎన్నికయయ్యారు. తరువాత.. జూలై 5, 2019 న  భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై గుజరాత్ నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.

ఒక విదేశాంగ కార్యదర్శిని దేశంలోని అత్యున్నత పదవి అయిన విదేశాంగ మంత్రిని చేయడం భారతదేశంలో మొదటిసారి జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎస్ జైశంకర్ చాలా కాలం పాటు భారత రాయబారిగా పనిచేశారు. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జైశంకర్‌ని భారత కార్యదర్శిగా నియమించారు. శ్రీ ఎస్.జైశంకర్ కూడా సెక్రటరీ పదవిని పొందాలని కలలు కన్నారని అంటున్నారు. తన సర్వీస్‌లో చివరి ఐదేళ్లు సెక్రటరీగా పనిచేశారు. ఆయన  2019లో తన పదవి నుండి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జైశంకర్ మోదీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు.

కీలక పదవులు

2015 - 2018 - విదేశాంగ కార్యదర్శి పదవిని నిర్వహించారు
2019 - భారత రాష్ట్రపతి తన విశిష్ట సేవలకు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
మే 30, 2019 - మోడీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన విదేశాంగ మంత్రిగా చేశారు.
 
ఎస్. జైశంకర్ ప్రొఫైల్ 

  • పూర్తి పేరు: సుబ్రమణ్యం జైశంకర్
  • వయస్సు: 69 సంవత్సరాలు  
  • పుట్టిన తేదీ: 9 జనవరి 1955
  • జన్మ స్థలం: న్యూఢిల్లీ
  • విద్యార్హత:  MA, MPhil, PhD,
  • రాజకీయ పార్టీ: భారతీయ జనతా పార్టీ
  • ప్రస్తుత స్థానం: విదేశాంగ మంత్రి
  • తండ్రి పేరు: శ్రీ కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం
  • తల్లి పేరు: శ్రీమతి సులోచన సుబ్రహ్మణ్యం
  • భార్య పేరు: క్యోకో సోమెకావా జైశంకర్
  • పిల్లలు: ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె( ధృవ్, అర్జున్,మేధా)
  • శాశ్వత చిరునామా బంగ్లా నెం. 9, 23 పృథ్వీరాజ్ రోడ్, న్యూఢిల్లీ
click me!