
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా తన దూకుడును పెంచుతూ.. పెద్ద ఎత్తున సైనిక బలగాలు కీవ్ వైపు దూసుకువస్తుండటం.. న్యూక్లియర్ వెపన్స్ బలగాలను పుతిన్ సిద్ధంగా ఉండాలంటూ సూచించిన నేపథ్యంలో భారత్ తన పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతోంది. భారత యుద్ధ విమానాల ద్వారా అత్యంత త్వరగా పౌరులను స్వదేశానికి తీసుకు రావడానికి భారత్ చర్యలు ప్రారంభించింది.
వివరాల్లోకెళ్తే.. రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో భారత పౌరుల రక్షణ కోసం ఇండియా అన్ని రకాల చర్యలు తీసకుంటోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన వరుస పెట్టి అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి "ఆపరేషన్ గంగా" ను ప్రారంభించింది. 'ఆపరేషనల్ గంగా' కింద కొనసాగుతున్న తరలింపు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే ప్రయత్నాల్లో చేరాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భారత వైమానిక దళానికి (IAF) పిలుపునిచ్చారు. "మా వైమానిక దళ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) సామర్థ్యాలను ఉపయోగించుకోవడం వలన తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించడానికి వీలవుతుంది. ఇది మానవతా సహాయాన్ని మరింత సమర్ధవంతంగా అందించడంలో కూడా సహాయపడుతుంది" అని ప్రధాని మోడీ అన్నారు.
రంగంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
మంగళవారం ప్రారంభమయ్యే ఆపరేషన్ గంగాలో భాగంగా భారత వైమానిక దళం.. కొన్ని సీ-17 విమానాలను మోహరించే అవకాశం ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై గత 24 గంటల్లో జరిగిన మూడో అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపాలనే నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో సుమారు 16,000 మంది విద్యార్థులు, భారత పౌరులు చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం 9 ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్థులను తరలిస్తోంది.
ఇప్పటివరకు 8 వేల మంది తరలింపు.. !
ఆపరేషన్ గంగా కింద భారతీయ పౌరుల తరలింపు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడానికి ఈ ఆపరేషన్‌లో చేరాలని ప్రధాని భారత వైమానిక దళాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వైమానిక దళ విమానాలు ఆపరేషన్‌లో చేరిన తర్వాత భారతీయుల తిరిగి వచ్చే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మొదటి సూచనలు జారీ చేసిన తర్వాత 8,000 మందిని ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తరలించారు. ఇప్పటివరకు ప్రత్యేక విమానాలు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయి. ఇక ప్రపస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగితే.. చాలా మంది భారత పౌరులు, విద్యార్థులను చాలా త్వరగా ఇండియాకు తీసుకురావడానికి వీలు కలుగుతుంది. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానాలు మంగళవారం నుంచి ఆపరేషన్ గంగాలో పాల్గొనే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
కిలో మీటర్లు కాలినడకతో పోలాండ్, రొమేనియా సరిహద్దులకు.. !
రష్యా దాడి నేపథ్యంలో భయాందోళనకు గురైన భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌ను ఎలాగైనా విడిచిపెట్టాలనుకుంటున్నారు. టాక్సీలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఉక్రెయిన్ రైల్వే తన సేవలను కొనసాగించినప్పటికీ, అధిక రద్దీ మరియు రైళ్ల ఆలస్యం కారణంగా విద్యార్థులందరికీ ఈ సౌకర్యం లభించడం లేదు. చాలా మంది విద్యార్థుల వద్ద తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు కూడా లేవు. అలాంటి దారుణ పరిస్థితుల్లోనే కాలినడకనే కిలో మీటర్ల మేర నడుస్తూ.. పోలాండ్, రొమేనియా సరిహద్దులకు చేరుకుంటున్నారు. పోలాండ్ వెళ్లే భారతీయ విద్యార్థులను ఆదుకునేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కొన్ని చోట్ల క్యాంపులను ప్రారంభించింది. రష్యన్ మాట్లాడే అధికారులను ఇక్కడకు పంపారు.