ఢిల్లీ సీఏఏ అల్లర్ల వెనుక: ఒక్క అబద్ధం.. భారీ విధ్వంసం, 50 మంది మరణం

By Siva KodatiFirst Published Jun 24, 2020, 4:09 PM IST
Highlights

బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మద్ధతుదారులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే పుకార్ల వల్లే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింసకు దారి తీసిందని పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు

చెప్పుడు మాటలు, పుకార్లు ఒక్కోసారి ఎంతో నష్టాన్ని మిగులుస్తాయి. ఢిల్లీలో అచ్చం అదే జరిగింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మద్ధతుదారులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే పుకార్ల వల్లే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింసకు దారి తీసిందని పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు.

కాగా కపిల్ మిశ్రా తన మద్ధతుదారులతో కలిసి మౌజ్‌పూర్‌లో ఫిబ్రవరి 23న సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించారు. అయితే వీరు జఫరాబాద్‌లో సీఏఏ వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే వదంతులు వ్యాపించడంతో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు.

Also Read:ఢిల్లీలో దారుణం.. సీఏఏ ఆందోళన..యువకుడి తలలోకి డ్రిల్లింగ్ మెషిన్ దించి...

దీంతో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో పాటు క్షణాల్లో ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించాయి. ఈ నేపథ్యంలో డయల్పూర్‌లో ఆందోళనలకు అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌పై దుండగులు దాడి చేసి దారుణంగా హత్య చేశారని పోలీసులు ఛార్జిషీటులో పేర్కొన్నారు.

అయితే ఉద్దేశపూర్వకంగా అల్లర్లను ప్రేరేపించడానికే ఈ వదంతులు వ్యాపించాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలకు సంబంధించి స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ పేరును ఛార్జిషీటులో ప్రస్తావించనప్పటికీ నిందితుడిగా పేర్కొనలేదు.

Also Read:సీఏఏ అల్లర్లు: నిరసనకారులపై కాల్పులు.. అడ్డొచ్చిన పోలీస్‌కు తుపాకీ గురిపెట్టి

కాని యోగేంద్ర... ఛాంద్ బాగ్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని వెల్లడించారు. అంతకుముందు సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగమే ఢిల్లీలో అల్లర్లకు కారణమైందని అంతర్జాతీయ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏకధాటిగా కొద్దిరోజుల పాటు కొనసాగిన అల్లర్లలో సుమారు 50 మంది మరణించిన సంగతి తెలిసిందే. 

click me!