Farm Laws: చట్టాల రద్దుపై ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు విభాగం ఏమన్నదంటే?

By telugu teamFirst Published Nov 19, 2021, 2:31 PM IST
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాగు చట్టాల రద్దుపై చేసిన కీలక ప్రకటన ఆశ్చర్యకరమని ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ తెలిపింది. సాగు చట్టాలను రద్దు చేస్తే దీర్ఘకాలంలో రైతులే నష్టపోతారని పేర్కొంది. అదే సమయంలో ప్రధాని నిర్ణయాన్నీ ప్రశంసించింది. అనవసర వివాదాలను పక్కన పెట్టడానికి ప్రధాని తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలిపింది. ఆది నుంచీ ఈ రైతు సంఘం మూడు సాగు చట్టాలను సమర్థిస్తున్నది. కానీ, కనీస మద్దతు ధర, ఇతర కొన్ని అంశాల్లో మార్పులను డిమాండ్ చేసింది.
 

న్యూఢిల్లీ: మూడు సాగు చట్టాల(Farm Laws)ను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) చేసిన ప్రకటన ఆశ్చర్యకరంగా ఉన్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ(ఆర్ఎస్ఎస్/RSS) అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ పేర్కొంది. నిజానికి ఈ చట్టాల రద్దుతో దీర్ఘకాలంలో రైతులే నష్టపోతారని భారతీయ కిసాన్ సంఘ్ సంస్థాగత కార్యదర్శి దినేశ్ కులకర్ణి తెలిపారు. అదే విధంగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేననీ అన్నారు. అనవసరమైన వివాదాలను పక్కన పెట్టడానికి చట్టాలు రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలిపారు. 

కొందరు రైతుల(Farmers) మొండితనం కారణంగా మూడు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చిందని, కానీ, ఈ నిర్ణయంతో దీర్ఘకాలంలో రైతులే నష్టపోతారని ఆయన వివరించారు. ఆ సాగు చట్టాల్లో కొన్ని మార్పులు చేస్తే చిన్న, సన్నకారు రైతులకే ఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవని తెలిపారు. రైతులకు నిజమైన సమస్యలు ఎక్కడుంటాయంటే మార్కెట్‌లోనే ఉంటాయని అన్నారు. మార్కెట్లోనే రైతులు దోపిడీకి గురవుతారని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తక్కువ ధరలకు అమ్ముకునే దుస్థితి ఎదుర్కొంటుంటారని వివరించారు. రైతులు పెట్టిన ఖర్చు ఆధారంగా పంట విలువను కట్టేలా చట్టం తెస్తే సమస్య తీరిపోయేదని తెలిపారు. 

Also Read: Farm Laws: మన దేశంలో చట్టాన్ని ఎలా రద్దు చేస్తారో తెలుసా?

బీకేఎస్ రైతు సంఘం వివాదాస్పద మూడు సాగు చట్టాలను సమర్థించింది. కానీ, కనీస మద్దతు ధరను చట్టబద్ధ హక్కుగా మార్చాలనే డిమాండ్‌తోపాటు మరికొన్ని మార్పులను ఆ సంస్థ కోరింది. పంటకు ధర లభించడం లేదనేదే రైతాంగంలో తీవ్ర ఆందోళనలకు కారణమవుతున్న విషయమని ఈ సంస్థ ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. 

కనీస మద్దతు ధర గురించి దినేశ్ కులకర్ణి మాట్లాడుతూ కనీస మద్దతు ధరను మరింత ప్రభావవంతం చేస్తామని ప్రధాని తమకు చెప్పారని వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారని పేర్కొన్నారు. ఆ నిర్ణయాన్ని తాము స్వాగతించామని అన్నారు. అయితే, ఆ కమిటీలో రాజకీయేతర సంస్థ సభ్యులనూ చేర్చాల్సిందిగా తాము కోరినట్టు తెలిపారు. 

Also Read: Farm Laws: ఆందోళనలు ఆగవు.. చట్టాల రద్దు సరే.. మద్దతు ధరపైనా మాతో చర్చించాలి: రైతులు

మూడు సాగు చట్టాలను ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పార్లమెంటులో ఈ రద్దు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆందోళన బాట వీడబోమని రైతు సంఘాలు తెలిపాయి. అంతేకాదు, మూడు సాగు చట్టాల రద్దుతోపాటు కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ అనేది తమ రెండో ప్రధాన డిమాండ్ అనీ గుర్తు చేశాయి. ఈ కనీస మద్దతు ధరపై ప్రభుత్వం తమతో చర్చించాలని కోరాయి. 

గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు సాగు చట్టాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా రైతాంగంలో కలకలం రేపింది. ఈ మూడు చట్టాల ద్వారా తాము కార్పొరేట్లకు మోకరిల్లే పరిస్థితులు దాపురిస్తాయని భయాందోళనలు వ్యక్తం చేసింది. ఫలితంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో స్థానికంగా ఆందోళనలు జరిగాయి. తర్వాత ఢిల్లీ సరిహద్దుకు ఆందోళనలు చేరాయి.

click me!