UP Elections 2022: బీజేపీలో చేరిన ఆర్‌పీఎన్ సింగ్... ప్రియాంక గాంధీ ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Jan 25, 2022, 8:34 PM IST
Highlights

కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్‌కు ఇప్పటి కాంగ్రెస్‌కు చాలా వ్యత్యాసం ఉన్నదని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కోసం, నూతన భారతావని నిర్మాణం కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. ఆయన పార్టీ నుంచి నిష్క్రమించడంపై ప్రియాంక గాంధీ స్పందించినట్టు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్(RPN Singh) ఈ రోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(Resignation) చేశారు. అనంతరం ఆయన బీజేపీ(BJP) కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘కనీసం 32 సంవత్సరాలుగా నేను ఒక పార్టీలో ఉన్నాను. కానీ, ఒక విషయం ఇక్కడ తప్పకుండా చెప్పాలి. ఒకప్పుడు ఉన్నట్టుగా ఆ పార్టీ ఇప్పుడు లేదు. ఈ రోజు దేశ ప్రజల ప్రయోజనాల కోసం, దేశ నిర్మాణం కోసం పని చేస్తున్న పార్టీ కేవలం బీజేపీ మాత్రమే అని ప్రజలు అందరికీ తెలుసు’ అని ఆయన అన్నారు. 2020లో కాంగ్రెస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకుని కేంద్ర మంత్రి బాధ్యతలు తీసుకున్న జ్యోతిరాదిత్య సింధియా పక్కనే ఆర్‌పీఎన్ సింగ్ కూర్చుని విలేకరులతో మాట్లాడారు. వీరిద్దరూ రాజవంశీకులే కావడం గనమార్హం.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని వీడిన రెండో సీనియర్ నేత ఆర్‌పీఎన్ సింగ్. అంతకు ముందే జితిన్ ప్రసాదా పార్టీని వీడి ప్రస్తుతం యోగి ఆదిత్యానాథ్ మంత్రివర్గంలో చేరిన చేరారు. కాగా, ఆర్‌పీఎన్ సింగ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటీవలే మంత్రి వర్గం నుంచి ఎస్పీలోకి స్వామి ప్రసాద్ మౌర్యపై పోటీ చేసే అవకాశం ఉన్నది. వీరిద్దరూ ఓబీసీ పట్టు ఉన్న నేతలే.

కాగా, ఆర్‌పీఎన్ సింగ్ పార్టీ వీడటంపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఇదే క్రమంలో ప్రియాంక గాంధీ కూడా స్పందించినట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ చేస్తున్న సమరంలో ధైర్య సాహసాలతోనే పాల్గొనాల్సి ఉంటుందని, పిరికివారు ఈ పోరాటం చేయలేరని ప్రియాంక గాంధీ స్పందించినట్టు ఆ పార్టీ పేర్కొంది.

ఆర్‌పీఎన్ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన రాజవంశీకుడు. ఆయన సైంథ్వార్ రాజకుటుంబానికి చెందినవాడు. ఆర్‌పీఎన్ సింగ్‌ పూర్తి పేరు కున్వార్ రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్. ఆయనను రాజా సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఆయన తండ్రి సీపీఎన్ సింగ్ కూడా కాంగ్రెస్‌ నాయుకుడే. ఖుషీనగర్ నుంచే ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా చేశారు. ఆర్‌పీఎన్ సింగ్ కూడా కేంద్రంలో పలు శాఖలకు బాధ్యతలు తీసుకున్నారు. 2011లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రిగా, 2012లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2013 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.

ఈ చురుకుదనాన్ని చూసే కాంగ్రెస్ నాయకత్వం ఆర్‌పీఎన్ సింగ్ ఆయనను పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ బాధ్యుడిగా నియమించింది. జార్ఖండ్‌కు కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఆయన చేశారు. ఆయన బాధ్యుడిగా ఉన్నప్పుడూ రుసరుసలాడుతూ చాలా మంది పార్టీ నేతలు ఆయన వద్దకు వచ్చే వారు. తాము ఇక ఎంతమాత్రమూ పార్టీలో ఉండబోమని ఆవేశంతో చెప్పుకుపోతుంటే.. ఆర్‌పీఎన్ సింగ్ వారి భుజాలపై నుంచి చేతులు వేసి అల్లుకుని ఒక నవ్వు, ఒక జోకు విసిరి కూల్ చేసేవాడని పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. చాయ్, సమోసాలు, చిప్స్‌తో రెబల్స్‌ను మళ్లీ దారికి తెచ్చేవాడని పేర్కొంటాయి. రెండు నిమిషాలు ముచ్చట్లు, ఒక చాయ్, ఒక సమోసా.. అంతే. వాటితోనే రెబల్స్‌ను సులువుగా తన చతురతతో రాజీకి తెచ్చేవాడని చెబుతుంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఆర్‌పీఎన్ ముక్కుసూటి తనంతో కాంగ్రెస్ నాయకత్వాన్ని కొంచెం దూరమైనట్టు భావిస్తున్నారు.

click me!