సీడీఎస్ బిపిన్ రావత్ చాపర్ కూలిపోవడానికి కారణం అదేనా?.. త్వరలో వైమానిక దళ దర్యాప్తు రిపోర్టు

By Mahesh KFirst Published Jan 2, 2022, 2:27 PM IST
Highlights

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గత నెల 8వ తేదీన హెలికాప్టర్ కూలిపోయి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, మరో పది మంది మరణించగా, తర్వాత కొన్ని రోజులకు చికిత్స పొందుతూ గ్రూప్ కెప్టెన్ కూడా చనిపోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై వైమానిక దళం దర్యాప్తు చేస్తున్న రిపోర్ట్ మరో ఐదు రోజుల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి సమర్పించనుంది. ఈ రిపోర్టుపై ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా.. కొన్ని వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి. 
 


న్యూఢిల్లీ: గత నెల ఇండియాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్(CDS Bipin Rawat) తాను ప్రయాణిస్తున్న చాపర్ క్రాష్(Chopper Crash) కావడంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ హెలికాప్టర్(Helicopter) నేల కూలడంపై అనేక అనుమానాలు వచ్చాయి. ఎలాంటి వదంతులు వ్యాపింపిజేయవద్దని ఆర్మీ(Indian Army) కూడా కోరింది. ఈ ఘటనపై భారత వైమానిక దళం(Air Force) దర్యాప్తు చేస్తున్నది. త్వరలోనే అంటే.. మరికొన్ని రోజుల్లోనే ఈ దర్యాప్తు నివేదికను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి సమర్పించనుంది. ఈ ఘటనపై చేస్తున్న దర్యాప్తునకు సంబంధించి అటు ఎయిర్ ఫోర్స్ అయినా.. ఇటు కేంద్ర ప్రభుత్వం అయినా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, కొన్ని విశ్వసనీయ వర్గాలు మాత్రం కీలక విషయాలను వెల్లడించాయి.

వాతావరణం ప్రతీకూలంగా ఉండటంతో.. విజిబిలిటీ మందగించి ఉండవచ్చని, ఈ కారణంగానే చాపర్ క్రాష్ అయి ఉన్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. మన దేశ టాప్ హెలికాప్టర్ పైలట్, ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ సారథ్యంలో సాగుతున్న కోర్టు ఎంక్వైరీ.. నేల కూలిన ఆ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా మార్గం తప్పి ఉండవచ్చని భావిస్తున్నట్టు వివరించాయి. అందుకే ఆ హెలికాప్టర్ అననకూల ప్రాంతానికి దూసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నాయని పేర్కొన్నాయి. అయితే, సాంకేతిక పొరపాట్లు, మెకానికల్ లోపాలూ ఈ ప్రమాదానికి కారణాలు అయి ఉండవని తెలిపాయి.

Also Read: Bipin Rawat Funeral : ఇక సెలవ్.. ముగిసిన రావత్ దంపతుల అంత్యక్రియలు, యావత్ దేశం కన్నీటి వీడ్కోలు

కాగా, ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ పొరపాటు, మేఘావృతమైన ఆకాశంలో కొండ ప్రాంతం గుండా వెళ్లడానికి గల నిబంధనలు ఉల్లంఘించి ఉంటారా? అనే విషయాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎయిర్ ఫోర్స్ లీగల్ డిపార్ట్‌మెంట్ సలహాలు, సూచనలతో దర్యాప్తు బృందం ఈ ఎంక్వైరీని పూర్తి చేస్తున్నది. మరో ఐదు రోజుల్లో ఈ రిపోర్టును ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి అందించనుంది.

గత నెల 8వ తేదీన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని నిలగిరీ కొండల్లో ఎంఐ-17వీ5 చాపర్ కూలిపోయింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తోపాటు మరో పది మంది మరణించారు. కూనూర్ రీజియన్‌లో హెలికాప్టర్ కూలిపోగానే.. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, జనరల్ బిపిన్ రావత్ కీలక సహాయకుడూ మరణించారు. కాగా, అదే హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను హాస్పిటల్ చేర్చారు. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. రష్యాలో తయారైన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ చాలా సురక్షితమైనదని, సౌలభ్యకరమైనదని నిపుణులు చెప్పారు. ఇదే చాపర్ ప్రమాదానికి గురైంది. ల్యాండ్ కావడానికి ఏడు నిమిషాల ముందు హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది.

Also Read: Bipin Rawat last speech: సీడీఎస్ బిపిన్ రావత్​ చివరి సందేశం విడుద‌ల‌.. ఏం మాట్లాడారంటే..?

బిపిన్ రావత్ తన చివరి సందేశంలో ఇలా మాట్లాడారు. స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా.. భారత దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను నేను అభినందిస్తున్నాను. 1971 ఇండియా-పాక్ యుద్ధంలో భారత్ విజ‌యం సాధించి.. 50 యేండ్లు పూర్తయింది. ఆ మ‌ర‌ణ వీరుల త్యాగాల‌కు గుర్తుగా 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' జరుపుకుంటున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో, నేను ధైర్యవంతులను స్మరించుకుంటాను. వారి త్యాగాలకు నా నివాళులర్పిస్తాను..’అంటూ తన చిట్టచివరి సందేశంలో సీడీఎస్ రావత్ పేర్కొన్నారు.

click me!