గ్యాంగ్‌స్టర్ భజరంగీ హత్య: లావుగా ఉన్నాడని చంపా.. కాదు పథకం ప్రకారమే చంపాడు

First Published Jul 10, 2018, 4:41 PM IST
Highlights

మున్నాను చంపిన సునీల్ రాతీని హత్య జరిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతను చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోయారు.. భజరంగీ తనను లావుగా ఉన్నాడని హేళన చేశాడని అందుకే చంపేశానని చెప్పాడు

కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ మున్నా భజరంగీ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జైల్లో తోటి ఖైదీ చేతిలోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యూపీ ఉలిక్కిపడింది. వ్యక్తిగత కక్షతో పాటు.. అనేక మంది రాజకీయ నాయకుల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని భజరంగీని పథకం ప్రకారం చంపాశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మున్నాను చంపిన సునీల్ రాతీని హత్య జరిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతను చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోయారు..

భజరంగీ తనను లావుగా ఉన్నాడని హేళన చేశాడని అందుకే చంపేశానని చెప్పాడు.. ప్రతి రోజు లాగే నేను మా గదిలో నడుస్తున్నాను.. ఇంతలో భజరంగీ నన్ను దాటి ముందుకు వెళ్లి.. వెనక్కి తిరిగి చూస్తూ నేను చాలా లావుగా ఉన్నానంటూ హేళన చేశాడు.. నన్ను అలా అనవద్దని ఎన్నిసార్లు చెప్పినా మున్నా వినలేదు.. దీంతో మా మధ్య గొడవ జరిగిందని.. ఇంతలో అతను తుపాకీ తీశాడని.. నేను అతన్ని కొట్టి తుపాకీని లాక్కొని.. భజరంగీ తలలోకి కాల్చానని.. అనంతరం తుపాకీని మురుగుకాల్వలో పడేశానని చెప్పాడు.

అయితే అతని వ్యాఖ్యలను మరో ఖైదీ ఖండించాడు.. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదని.. రాతీ కావాలనే భజరంగీపై దాడి చేశాడని.. కనీసం భజరంగీకి పారిపోయేందుకు కూడా వీలు చిక్కలేదన్నాడు. రాతీతో పాటు ఖైదీ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిన హత్యగానే తేల్చారు..

ఎందుకంటే ఒక కేసు నిమిత్తం కోర్టులో ప్రవేశపెట్టేందుకు భజరంగీని ఆదివారం ఝాన్సీ జైలు నుంచి బాగ్‌పట్‌కు తీసుకొచ్చారు.. కాబట్టి రాత్రికి రాత్రి భజరంగీ చేతికి ఆయుధాలు వచ్చే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు. మరింత లోతైన దర్యాప్తు జరిగితే ఈ హత్య ఎందుకు జరిగింది.. అతని వెనుక ఎవరున్నారో తెలుస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
 

click me!