
ముంబై : ప్రభుత్వ హాస్టల్ లో 18 యేళ్ల విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు గార్డు ఓం ప్రకాష్ కనోజియా తనను వేధిస్తున్నాడని, దగ్గరి, దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడని.. ఘటనకు కొద్ది రోజుల ముందు బాధితురాలు తన తోటి వారికి చెప్పినట్లు తెలుస్తోంది.
దక్షిణ ముంబైలోని ప్రభుత్వ మహిళా హాస్టల్‌లో మంగళవారం గార్డు ప్రకాష్ కనోజియా ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో.. బాధితురాలు 18 ఏళ్ల విద్యార్థిని తోటి హాస్టల్ మేట్ తో ఈ విషయం చెప్పినట్టుగా వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి (53) ఈ విషయం కూతురు తనకు కూడా చెప్పినట్లు ధృవీకరించారు.
కూతురు చెప్పిన తరువాత అదే విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు తెలియజేయమని తాను ఆమెకు సలహా ఇచ్చానని తెలిపారు. అయితే, వార్డెన్ మాత్రం తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులకు తెలిపారు. హాస్టల్‌లో ముగ్గురు గార్డులు ఉన్నారు, అందరూ పురుషులే.
బాలికల హాస్టల్‌లో మహిళా గార్డులు ఎందుకు లేరని తండ్రి ప్రశ్నించారు. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ చాలా వరకు ఖాళీగా ఉన్నందున తనను దిగువ అంతస్తుకు మార్చమని తన కుమార్తె వార్డెన్‌ను కోరిందని, అయితే వార్డెన్ మాత్రం ఉంటే నాల్గవ అంతస్తులోని గదిలో ఉండమని లేదా హాస్టల్ వదిలి వెళ్లమని చెప్పిందని అతను పేర్కొన్నాడు.
ప్రభుత్వ హాస్టల్‌లో 18 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. అనుమానితుడు రైలు ట్రాక్ పై పడి ఆత్మహత్య...
గురువారం ఉదయం శివాజీ పార్క్ ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీనియర్ పోలీసు అధికారి బుధవారం రాత్రి తెలిపారు. అకోలా జిల్లా నుండి వచ్చిన బాధితురాలు, బాంద్రా కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో డిప్లొమా రెండవ సంవత్సరం చదువుతోంది. ఏప్రిల్ 2021 నుండి హాస్టల్‌లో ఉంటోంది. ఆమెకు కవల సోదరుడు ఉన్నాడు.
కనోజియా (35) మంగళవారం ఉదయం 4.44 గంటలకు హాస్టల్ నుండి బయలుదేరాడు. కొద్ది నిమిషాల తర్వాత రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు వారాల క్రితమే కనోజియా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పినట్లు బాధితురాలి స్నేహితురాలు పోలీసులకు తెలిపింది. కారిడార్ లైట్లు ఆఫ్ చేసి, ఆన్ చేసి వేధించేవాడని తెలిపింది.
విషయం తెలుసుకున్న పోలీసులు వార్డెన్‌ను ప్రశ్నించగా, ఎవరూ చెప్పకపోవడంతో తనకు తెలియదని చెప్పింది. బాధితురాలి స్నేహితురాలు ఎవరికీ సమాచారం ఇవ్వలేదని పోలీసు అధికారి తెలిపారు. కనోజియాకు వివాహం అయ్యింది. 12, నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులున్నారు. అతని కుటుంబం యూపీలోని అతని స్వస్థలమైన ప్రతాప్‌గఢ్‌లో ఉంటున్నారు. అతడిపై గతంలో ఎలాంటి ఫిర్యాదులు లేవని పోలీసులు గుర్తించారు.
బాధితురాలి మీద అత్యాచారం జరిగిందా? లేదా? నిర్ధారించడానికి పోలీసులు శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె మరణానికి కారణం గొంతు నులిమి చంపడమేనని ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. నాలుగో అంతస్తులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. "కనోజియా ఫోన్ ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది. అతని యాక్టివిటీ గురించి వివరాలను తెలుసుకోవడానికి దానిని సైబర్ విశ్లేషణ కోసం పంపుతున్నాం" అన్నారు.
హాస్టల్‌లో 450 మంది బాలికలు ఉండే ఫెసిలిటీ ఉంది, అయితే మంగళవారం కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. బిల్డింగులో మరమ్మత్తులు జరుగుతుండడం.. సెలవులు ప్రారంభమైనందున బాధితురాలి రూమ్‌మేట్‌తో సహా చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. "అమ్మాయి సోమవారం ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యింది. ఆమె అకోలాకు రైలు టికెట్ బుక్ చేసుకుంది. జూన్ 8న బయలుదేరాల్సి ఉంది" అని బాధితురాలి బంధువు చెప్పారు.
సోమవారం రాత్రి 11.30 గంటలకు హాస్టల్ మేట్ చివరిసారిగా బాలికతో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు బాలికను తన గదిలోనే ఉండమని కోరిందని, అయితే ఆమె తన గదిలోనే ఉండటానికి ఇష్టపడిందని ఆమె స్నేహితురాలు తెలిపింది.
ఆమె ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మంగళవారం సాయంత్రం నేరం వెలుగులోకి వచ్చింది.
మంగళవారం ఉదయం తన కుమార్తె తమకు ఫోన్ చేయలేదని, అందుకే ఉదయం ఆమె నంబర్‌కు ప్రయత్నించానని, తర్వాత రెండు సార్లు ప్రయత్నించానని, అయితే స్పందన లేదని బాలిక తండ్రి చెప్పారు. "నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు, కనోజియా నంబర్ కూడా తీసుకున్నాను. ఏదైనా అవసరమైతే నా కుమార్తెకు సహాయం చేస్తానని అతను నాకు చెప్పాడు. నేను మంగళవారం అతనికి చాలాసార్లు ఫోన్ చేసాను, కానీ స్పందన లేదు" అని తండ్రి చెప్పారు.
చివరకు తన కూతురి హాస్టల్ మేట్‌కి ఫోన్ చేశాను. ఆమె మేట్రన్‌కు సమాచారం ఇచ్చింది. "సాయంత్రం 5 గంటలకు, ఒక మహిళా పోలీసు అధికారి నన్ను పిలిచి ముంబైకి రమ్మని అడిగారు" అని అతను చెప్పాడు. మంగళవారం రాత్రి తల్లిదండ్రులు ముంబై చేరుకున్నారు. "జూన్ 5 రాత్రి చివరిసారిగా ఆమెతో మాట్లాడాను. తన తల్లి గురించి ఆరా తీసింది." అని తండ్రి దుఃఖంతో చెప్పుకొచ్చారు.