కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు బెర్త్ కన్ఫార్మ్ అయింది. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వారు ప్రమాణం చేయనున్నారు. వారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ 3.0 పాలన నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇందుకోసం ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా పలువురు ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు బెర్త్ కన్ఫార్మ్ అయింది. మూడోసారి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఎన్నికైన కింజరాపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం)కి కేంద్ర పదవి ఖాయమైంది. అలాగే, తొలిసారి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి దక్కనుంది. ఇవాళ (ఆదివారం)ప్రధాని మోదీతో పాటు వీరిద్దరూ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
undefined
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ.. 17 స్థానాల్లో పోటీ చేసి 16 సీట్లు గెలుచుకుంది. ఎన్‌డీయేలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్ర మంత్రివర్గంలో పదవులు దక్కించుకోగా.... ఇప్పటికే కేంద్ర మంత్రి పదవులు దక్కించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
రామ్మోహన్ నాయుడుకు కలిసొచ్చిన అంశాలు...
కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికయ్యారు.
కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా మంచిపేరుంది.
తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం ఉంది.
రాష్ట్ర సమస్యలపై అనేకమార్లు పార్లమెంటు చర్చల్లో ధాటిగా మాట్లాడారు.
వ్యక్తిగత జీవితం
స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ
వయసు: 36 ఏళ్లు, విద్యార్హత: బీటెక్, ఎంబీఏ
తల్లిదండ్రులు: ఎర్రన్నాయుడు-విజయలక్ష్మి
భార్య: శ్రావ్య, కుమార్తె: నిహిర అన్వి శివాంకృతి
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడకు బాబాయి.
తొలి అడుగులోనే లక్కీ ఛాన్స్...
పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాపారవేత్త.
తొలిసారి 2024లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం.
గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి వైద్యుడిగా అమెరికాకు వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
యు వరల్డ్ పేరుతో ఆమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆన్‌లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించారు.
ఆన్‌లైన్ శిక్షణ ఇస్తూ రూ.వేల కోట్ల సంపాదన.
అంతర్జాతీయ పరిశ్రమలు తీసుకురావడం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో అయనకున్న అనుభవం కలిసొచ్చే అంశం
వ్యక్తిగత జీవితం
పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ
జన్మస్థలం: గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం
వయసు: 47సంవత్సరాలు
విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండీ
తల్లిదండ్రులు: పెమ్మసాని సాంబశివరావు-సువర్చల
భార్య: డాక్టర్ శ్రీరత్న, కుమారుడు, కుమార్తె