ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు

By narsimha lode  |  First Published Jan 18, 2024, 3:40 PM IST

 ఈ నెల  22న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీంతో  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు  కేంద్రం  సగం రోజును సెలవుగా ప్రకటించింది.


న్యూఢిల్లీ: ఈ నెల  22వ తేదీన సగం పూట  సెలవును  ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు  ఈ సగం రోజు  సెలవు వర్తిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.  

ఈ నెల  22న అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది.  దీంతో ఈ వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే  సంస్థలు సగం రోజు  మూతపడనున్నాయి.మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయి. 

Latest Videos

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  ఆరు స్టాంపులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ విడుదల చేశారు. మరో వైపు  ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రాముడిపై విడుదల చేసిన స్టాంపులకు చెందిన బుక్ ను కూడ మోడీ విడుదల చేశారు. 

అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టకు చెందిన  శ్రీరామతీర్థక్షేత్ర ట్రస్ట్  ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే  ఈ ప్రాణ ప్రతిష్టకు ఎంపిక చేసిన వారికి  ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది.  ఈ నెల  23వ తేదీ నుండి సాధారణ భక్తులకు  ఆలయంలో  శ్రీరాముడి దర్శనం కోసం అనుమతిస్తారు. 

ఈ నెల  22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో  రామ మందిరం ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి  ఈ నెల  16నే  అయోధ్య ఆలయ సముదాయంలో  వేడుకలు ప్రారంభమయ్యాయి.  ప్రాణ ప్రతిష్టకు ముందు ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.


 

click me!