
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ పార్టీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే కొత్త పార్లమెంట్ హౌస్ ప్రతిపాదన వచ్చిందని, దాదాపు రూ.3000 కోట్లు వెచ్చించేందుకు సన్నాహాలు చేశారని ఆయన ట్వీట్ చేశారు. అయితే దానిని ఇప్పుడు రూ.971 కోట్లతో నిర్మిస్తుండడం కాంగ్రెస్‌తో సహా ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోందని రాజ్యవర్థన్ చురకలంటించారు.
2014లో మోదీజీ నేతృత్వంలో కేంద్రంలో నిజాయితీగల ప్రభుత్వం వచ్చిందని ఆయన ప్రశంసించారు. కొత్త పార్లమెంట్ భవనం అంచనా వ్యయం రూ.3000 కోట్ల నుంచి కేవలం ₹971 కోట్లకు తగ్గిందన్నారు. నేడు దేశం కొత్త పార్లమెంట్, సెంట్రల్ విస్టాలను ప్రజల ఆకాంక్షకు చిహ్నంగా భావిస్తుంటే కాంగ్రెస్‌కు షాక్ తగిలిందని రాజ్యవర్ధన్ సింగ్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
ఈ సందర్భంగా 2012లో యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త పార్లమెంట్ భవన వివరాలను కూడా పంచుకున్నారు. 2012లో సోనియా రిమోట్ కంట్రోల్‌లో ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో కొత్త పార్లమెంట్ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అప్పుడు చర్చ జరిగిందన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కమీషన్‌లు అనేవి సర్వసాధారణమని ఆయన విమర్శలు గుప్పించారు. చివరికి ఈరోజు కాంగ్రెస్ తడబాటుకు గురవుతోందని రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చురకలంటించారు.