
మరో రెండు రోజుల్లో 6 రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇదే ఊపులో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కూడా తమ సభ్యులను ఎగువ సభకు పంపించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఉన్న బలం ఎంత ? ఏ రాష్ట్రంలో ఎన్ని రాజ్యసభ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి ? ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరస్థితులు ఏంటి అనే విషయాలను తెలుసునే ప్రయత్నం చేద్దాం.
అస్సాంలో..
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈ రాష్ట్రం నుంచి రెండు స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక స్థానం కోసం బీజేపీ పబిత్రా మార్గరీటాను అనే వ్యక్తిని నామినేట్ చేయగా.. దాని మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ - లిబరల్ (UPP-L) రుంగ్వ్రా నార్జారీని ప్రతిపాదించింది. రెండు స్థానాలను తామే గెలుచుకుంటామని సీఎం హిమంత బిస్వా శర్మ ధీమా వ్యక్తం చేశారు. కాగా మరోవైపు కాంగ్రెస్ తన అభ్యర్థిగా రిపున్ బోరాను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఆయన పదవి పూర్తి కానుంది.
అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రం నుంచి ఒక రాజసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే కాంగ్రెస్ కు మొత్తం 42 మంది ఎమ్మెల్యేల అవసరం. అయితే తమ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు, ఏఐయూడీఎఫ్‌కు 15 మంది ఎమ్మెల్యేలు, సీపీఎంకు చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు ఇస్తారని, దీంతో మొత్తంగా తమకు 44 సభ్యుల బలం లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మరోవైపు అనేక మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ మిత్రపక్షమైన యూపీపీఎల్ నామినేట్ చేసిన సభ్యుడికి ఓటు వేస్తారని బీజేపీ ధీమాగా ఉంది. మరో స్థానం ఎలాగో తామే గెలుస్తామని పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్ లో..
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 68 స్థానాలు ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి పూర్తిగా బలం ఉంది. దీంతో ఆ పార్టీ హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ (HPU) మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ సికిందర్ కుమార్ నామినేట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
కేరళలో..
కేరళ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తన మహిళా విభాగం చీఫ్ జేబీ మాథర్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదించింది. అధికార ఎల్‌డీఎఫ్ సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎఎ రహీమ్, సీపీఐ నాయకుడు పి సంతోష్ కుమార్‌లను నామినేట్ చేసింది. కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉన్నాయి. ఇందులో అధికార ఎల్‌డీఎఫ్ కు 99 సీట్లు ఉన్నాయి. దీంతో రెండు స్థానాలు ప్రభుత్వం నామినేట్ చేసిన అభ్యర్థులే గెలుచుకుంటారు. కాంగ్రెస్ కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది.
నాగాలాండ్ లో..
దేశంలోనే ప్రతిపక్ష పార్టీలు లేని మొదటి రాష్ట్రం నాగాలాండ్. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్డీపీపీ, బీజేపీ, ఎన్ పీఏఎఫ్ ల, స్వతంత్ర అభ్యర్థులు కలిసి యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (UDA) గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిని బీజీపీ లీడ్ చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ కు బీజేపీ మమిళా విభాగం చీఫ్ ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో నాగాలాండ్ నుంచి ఎగువ సభకు నామినేట్ అవుతున్న మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.
త్రిపురలో..
త్రిపురలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. రాష్ట్రంలోని ఒకే రాజ్యసభ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మాణిక్ సాహాను అధికార పార్టీ నామినేట్ చేసింది. అయితే లెఫ్ట్ ఫ్రంట్ మాత్రం సీనియర్ సీపీఐ(ఎం) కురువృద్ధుడు భాను లాల్ సాహాను రంగంలోకి దింపింది. మొత్తం 60 సీట్లకు గాను 40 సీట్లతో బీజేపీ ఒక్క రాజ్యసభ సీటును గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ఎంపీ జర్నా దాస్ బైద్య ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనున్నారు.
పంజాబ్ లో..
ఇటీవలే జరిగిన పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 92 స్థానాలు గెలుచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఈ రాష్ట్రంలో ఐదు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. దీంతో ఆప్ పంజాబ్ ఇన్‌చార్జి రాఘవ్ చద్దా, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, వ్యాపారవేత్త సంజీవ్ అరోరాలను అధికార పార్టీ నామినేట్ చేసింది. దీంతో వీరి ఎన్నిక లాంఛనమే కానుంది.
రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయంటే ?
రాజ్యసభ శాస్వత సభ. దీనిని ఎగువ సభ అని కూడా పిలుస్తారు. ఇది లోక్ సభ మాదిరిగా ఐదు సంవత్సరాలకు ఒక సారి రద్దు కాదు. ఇది శాశ్వత సభ. దీంతో ప్రతీ రాష్ట్రం నుంచి సభ్యులు ప్రాతినిద్యం వహిస్తారు. అందుకే దీనిని ‘రాష్ట్రాల మండలి’ అని కూడా అంటారు. ఈ సభకు ఎన్నికైన సభ్యుని పదవి కాలం ఆరు సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రతీ రాష్ట్రం, 2 కేంద్రపాలిత ప్రాంతాలు (UT) తమ ప్రతినిధులను ఈ పెద్దల సభకు పంపిస్తాయి. శాసన సభ సభ్యులు దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా ఒకే బదిలీ ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా నిర్వహిస్తారు.