ప్రతిపక్షాల సమావేశానికి మమతా బెనర్జీ పిలుపు: విపక్షపార్టీల నేతలు, సీఎంలకు లేఖ

Published : Mar 29, 2022, 01:13 PM ISTUpdated : Mar 29, 2022, 01:24 PM IST
ప్రతిపక్షాల సమావేశానికి మమతా బెనర్జీ పిలుపు: విపక్షపార్టీల నేతలు, సీఎంలకు లేఖ

సారాంశం

కేంద్రంలో అధికారంలోని బీజేపీ‌పై పోరుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సిద్దమయ్యారు. విపక్షపార్టీల నేతలు, సీఎంలకు మమతా బెనర్జీ లేఖ రాశారు. 

కేంద్రంలో అధికారంలోని బీజేపీ‌పై పోరుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సిద్దమయ్యారు. విపక్షపార్టీల నేతలు, సీఎంలకు మమతా బెనర్జీ లేఖ రాశారు. అంతా కలిసి వచ్చి బీజేపీ ఐక్యంగా పోరాడాలని కోరారు. ప్రజాస్వామ్యంపై బీజేపీపై ప్రత్యక్షదాడులు చేస్తుందని మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా "ముందుకు వెళ్లే మార్గం" గురించి చర్చించడానికి కలిసివచ్చేవారంతా సమావేశమవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

దేశ సమాఖ్య నిర్మాణంపై బీజేపీ పదే పదే దాడి చేస్తుందని మమతా బెనర్జీ లేఖలో పేర్కొన్నారు. బీజేపీ  అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దేశంలోని అన్ని ప్రగతిశీల శక్తులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రతిఒక్కరి సౌలభ్యం, అనుకూలత ప్రకారం.. ముందుకు సాగడానికి ఉద్దేశించిన సమావేశానికి అందరూ కలిసి రావాలని నేను కోరుతున్నాను. మన దేశానికి అర్హత ఉన్న ప్రభుత్వానికి దారితీసే ఏకీకృత, సూత్రప్రాయ ప్రతిపక్షం కోసం మనం కట్టుబడి ఉందాం’ అని మమతా బెనర్జీ విపక్ష నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికార బీజేపీ.. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటుందని విమర్శించారు. 

దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి, వేధించడానికి.. ఈడీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ ఉద్దేశాన్ని అందరం కలిసి ప్రతిఘటించాలని కోరారు. 

పక్షపాత రాజకీయ వల్లే ప్రజలకు న్యాయం జరగడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. కానీ ప్రస్తుతం కొన్ని పక్షపాత రాజకీయ జోక్యాల వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఇది మన ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన ధోరణి. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజలు ముఖ్యమైన మూలస్తంభాలు. ఇందులో ఏది దెబ్బతిన్న.. వ్యవస్థ కుప్పకూలుతుంది’ అని మమతా బెనర్జీ అన్నారు.  ప్రతిపక్ష పార్టీలుగా..  ఈ ప్రభుత్వాన్ని వారి చర్యలకు జవాబుదారీగా ఉంచడం తమ రాజ్యాంగ బాధ్యత అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే బెంగాల్‌లోని బీర్‌భూం హింసాకాండకు సంబందించి మమతా బెనర్జీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆమె నుంచి ఈ లేఖ రావడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?