బ్రహ్మోస్ గాల్లోకి లేస్తే.. పాకిస్థాన్ పచ్చడి పచ్చడే..: రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Published : Oct 18, 2025, 07:44 PM IST
Rajnath Singh

సారాంశం

Brahmos Missile : పాకిస్తాన్ లోని అంగుళం అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని… ఇక రెచ్చగొడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే… ఇకపై సినిమా చూపిస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.  

 Uttar Pradesh :  స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి మొదటి బ్యాచ్‌ను లాంచ్ చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి మాట్లాడుతూ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. 'పాకిస్తాన్‌లోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ పరిధిలో ఉంది' అని ఆయన అన్నారు. 

ఆపరేషన్ సిందూర్ భారతదేశ సామర్థ్యానికి కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఒకప్పటి భారతదేశ పునాదుల నుంచి పుట్టిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ఏమి చేయగలదో అర్థం చేసుకోవాలని అని హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌ సిందూర్ లో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషించిందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్. 

 బ్రహ్మోస్ తోనే భారతదేశ భద్రత

లక్నోలోని సరోజినీ నగర్‌లో నిర్మించిన 'బ్రహ్మోస్ ఏరోస్పేస్' (BrahMos Aerospace) అత్యాధునిక ప్లాంట్ ఇప్పుడు భారతదేశ క్షిపణి శక్తికి కేంద్రంగా మారింది. ఈ ఫ్యాక్టరీ సుమారు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. రూ.380 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం సుమారు 100 క్షిపణులను తయారు చేస్తోంది. ఈ క్షిపణులను ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం మూడింటికీ సరఫరా చేస్తారు. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదు, భారతదేశ భద్రతా చర్యలకు చిహ్నం' అని అన్నారు.

బ్రహ్మోస్ క్షిపణి సాంకేతికత అద్భుతం

బ్రహ్మోస్ క్షిపణి రెండు దశల సూపర్‌సోనిక్ క్షిపణి. మొదటి దశ సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్ ఇంజిన్, రెండవ దశ లిక్విడ్ ర్యామ్‌జెట్ ఇంజిన్. ఇందులో ఆధునిక స్టెల్త్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ గైడెన్స్ సిస్టమ్ ఉన్నాయి. దీని పరిధి 290 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది, దీనివల్ల ఏ శత్రు దేశం కూడా దీనిని అడ్డగించలేదు.  ఇలా బ్రహ్మోస్ ఇప్పుడు భారత సాయుధ దళాలకు వెన్నెముకగా మారింది.  

పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

భారతదేశం ఇప్పుడు ఏ రెచ్చగొట్టే చర్యకైనా కఠినంగా, తక్షణమే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ పాక్ ను హెచ్చరించారు. 'ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే... అవసరమైతే ఫుల్ సినిమా చూపిస్తాం' అని రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లక్నో ఇప్పుడు రక్షణ ఉత్పత్తికి కొత్త కేంద్రంగా మారిందని అన్నారు. బ్రహ్మోస్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్ కీర్తిని పెంచడమే కాకుండా భారతదేశాన్ని రక్షణ ఎగుమతి కేంద్రంగా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని యోగి అన్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu