ఓ ముఠా కాల్ గర్ల్స్ సేవలు అందిస్తామని అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. రాజస్తాన్‌లో ఈ ముఠా 80 మంది నుంచి సుమారు రూ. 5 కోట్ల వరకు దోపిడీ చేసింది. సోషల్ మీడియాలో నుంచి యువతుల ఫొటోలను నకిలీ పేర్లు, వివరాలతో కస్టమర్లకు పంపి ప్రలోభపెట్టేవారు. ఆ తర్వాత వారిని నేరుగా కలుసుకుని కత్తులతో బెదిరించి డబ్బులు గుంజేవారు.
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వేశ్యలను అందిస్తామని ఓ వెబ్ సైట్ ఓపెన్ చేశారు. ఆ వెబ్‌సైట్ ద్వారా అమాయకులను ప్రలోభపెట్టారు. వారిని భయభ్రాంతులకు గురి చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారు. 80 మంది నుంచి సుమారు రూ. 5 కోట్లు వసూలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్ పోలీసులు ఈ ముఠా దోపిడీని పసిగట్టింది. ఐదుగురిని అరెస్టు చేసింది. ఆ ముఠా మోడస్ ఆపరండీని వెల్లడించింది.
ఉదయ్ పూర్ పోలీసులకు ఆగస్టు 8వ తేదీన ఈ గ్యాంగ్ గురించి సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులు మనీశ్ చౌదరి, అశోక్ సేన్,సుబ్రాతి ఖాన్, దీపక్ మీనా, ప్రీతమ్ సింగ్‌లను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ మాస్టర్‌మైండ్ రాకేశ్ మీనా చేసిన నేరాన్ని అంగీకరించాడు. తన మిత్రుడు అంకిత్‌తో కలిసి టొట్టాక్స్ అనే వెబ్ సైట్ ద్వారా ఈ దోపిడీ చేశామని వివరించాడు. ఆ వెబ్ సైట్ ద్వారా కాల్ గర్ల్స్‌ను సప్లై చేస్తామని బోల్తా కొట్టించామని చెప్పాడు. రాజస్తాన్ మొత్తం తాము సేవలు అందిస్తున్నట్టు నమ్మించామని తెలిపాడు.
ఈ రాకెట్ ఎలా నడించింది?
ఈ గ్యాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి ర్యాండమ్‌గా యువతుల ఫొటోలను సేకరించి వారి వెబ్ సైట్ టొట్టాక్స్‌లో నకిలీ పేర్లతో అప్‌లోడ్ చేశారు. యూజర్లు కాల్ గర్ల్స్ కోసం వెతికి ఆ వెబ్ సైట్‌లోకి రాగానే అందమైన యువతుల ఫొటోలు, వాటి పక్కన వివరాలు(నకిలీవే) అందుబాటులో ఉండేవి. ఆ ఫొటో కింద చాట్, లేదా కాల్ అనే ఆప్షన్లు పెట్టారు. చాట్ బటన్ క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా యూజర్ ఫోన్‌లోని వాట్సాప్‌లో చాట్ ఓపెన్ అవుతుంది. జస్ట్ హాయ్ అని పెట్టగానే అటు వైపుగా నుంచి జైపూర్‌కు చెందిన గ్యాంగ్ 10 నుంచి 15 మంది యువతుల ఫొటోలు వాట్సాప్‌లో పంపేది.
కస్టమర్ ఒక ఫొటోను ఎంచుకోగానే ఆ యువతి రేట్‌ను షేర్ చేస్తారు. అనంతరం, ఆ యువతిని ఎక్కడకు తీసుకురమ్మంటారో లొకేషన్ అడిగేవారు. ముగ్గురు నుంచి నలుగురు కారులో ఓ యువతితో కస్టమర్‌కు ఆ లొకేషన్‌లో కనిపించేవారు. కస్టమర్‌ను ఆయన కారును చూసి అతని ఆర్థిక హోదాను అంచనా వేసేవారు. దూరం నుంచి కస్టమర్ కారులో యువతిని చూసిన తర్వాత ముందుగా ఒప్పుకున్న డబ్బును ఆ గ్యాంగ్ తీసుకునేది. అమ్మాయిని పంపించాలని కస్టమర్ అడగ్గానే కత్తులు తీసి బెదిరించేవారు. వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని బెదిరించేవారు. చాలా మంది భయంతో, అవమాన భయంతో పారిపోయేవారని ఆ గ్యాంగ్ సభ్యులు పోలీసులకు దర్యాప్తులో వెల్లడించారు.
Also Read: Rajasthan: బీజేపీ లిస్టులో అసమ్మతి నేత వసుంధర రాజే, ఫస్ట్ లిస్టులో కాంగ్రెస్ ఫైటర్లు పైలట్, గెహ్లాట్
మరో విధానంలోనూ ఈ గ్యాంగ్ దోచుకునేది. గ్యాంగ్ మెంబర్ ఓ ఎస్‌యూవీలో స్పాట్‌కు వెళ్లి కస్టమర్‌ను కారులోకి ఎక్కాలని కోరేవారు. కారులోకి ఎక్కగానే కస్టమర్ చుట్టూ గ్యాంగ్ సభ్యులు చేరి దాడి చేసేవారు. కస్టమర్‌ను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవారు. ఇంకా ఎక్కువ డబ్బును డిమాండ్ చేసేవారు. పరువు కోసం ఆలోచించి చాలా మంది కస్టమర్లు డబ్బులు చెల్లించి బయటపడేవారు. ఆ గ్యాంగ్ కత్తులను, రాడ్‌లను ఎప్పుడూ కారులోనే ఉంచుకునేది.
ఆ గ్యాంగ్ సభ్యులు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. వాళ్లు ఖరీదైన ఫోన్లు, లగ్జరీ హోటల్‌లో గడిపేవారు. దోచిన డబ్బుతో లిక్కర్ పార్టీలు చేసుకునేవారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, పది ఖరీదైన ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, రెండు అకౌంటింగ్ డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.